
అంతా అభివృద్ధి పథాన నడవాలి
కొత్త సంవత్సర ఆగమన వేళ పలువురు ప్రముఖుల ఆకాంక్ష
ప్రజలకు గవర్నర్, తెలంగాణ సీఎంల శుభాకాంక్షలు
నేడు గవర్నర్ నరసింహన్ ప్రజా దర్బార్
ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం 2015 ఆగమనం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇరురాష్ట్రాల ప్రజలకు బుధవారం కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాల అభివృద్ధి పథంలో పయనించాలని కోరారు. ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం తొలిరోజైన గురువారం రాజ్‌భవన్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలను, ప్రజాప్రతినిధులను కలవడానికి గవర్నర్ నరసింహన్ అందుబాటులో ఉంటారు. సామాన్య ప్రజలంతా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలపవచ్చని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
కొత్త ఏడాదిలో ఆకాంక్షలు నెరవేరాలి : తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తీరాలని ఆకాంక్షించారు. ఎన్నో పోరాటాల తర్వాత ప్రజల తెలంగాణ రాష్ట్ర కల 2014లో నెరవేరిందని, ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 2015 సంవత్సరం ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
బంధం బలపడాలి..:తమిళనాడు గవర్నర్
కొత్త ఏడాది ప్రజల్లో నూతనోత్సాహాలను కలిగించాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం కొత్త విజ్ఞానాన్ని అందించాలని, ప్రజల మధ్య బంధాలు బలపడి, శాంతిసామరస్యాలు వెల్లివిరియాలన్నారు.
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి: కిషన్‌రెడ్డి
కొత్త ఏడాది సందర్భంగా ఆయురారోగ్యాలు, పాడిపంటలతో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా, సుపరిపాలనతో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రజలు ముందుకు రావాలన్నారు.