తిరుపతి అర్బన్: తిరుమలలో మరింత మెరుగైన విద్యుత్ వెలుగులు నింపే క్రమంలో రానున్న ఫిబ్రవరి నాటికి మొత్తం ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. వివిధ టీటీడీ పథకాలు, అభివృద్ధి పనులపై శనివారం ఆయన సీనియర్ అధికారులతో సమీక్షించారు. ఈఓ మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలోనూ విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వెండివాకిలి ప్రాకారంలోని శ్రీనివాస కల్యాణం చిత్రాలకు ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే కాలిబాట భక్తులకు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వద్దనుంచి మోకాలిమిట్ట వరకు రోడ్డుపై ఉన్నందున భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా కాలిబాట మార్గాల్లో భక్తులు జారిపడకుండా తగిన ఏర్పాట్లు తీసుకోవాలన్నారు.
ఆలయంలో భక్తులు తడవకుండా..
తిరుమల ఆలయంలోని మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు రిట్రాక్టబుల్ రూఫింగ్‌ను ఏర్పాటు చేసి భక్తులు వర్షంలో తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసాదాలు స్వీకరించే ప్రాంతంలోని కొళాయిల వద్ద పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, జారిపడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే పారిశుద్ధ్య సిబ్బందిని పెంచుకోవాలన్నారు. వేడినీటితో శుభ్రం చేసే యంత్రాలను వినియోగించేందుకు అనువైన చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో క్యూలపై అధ్యయనం చేసి భక్తులు సౌకర్యంగా దర్శనానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీవీఎస్‌ఓ రవికృష్ణకు సూచించారు. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర ప్రాంతాల్లో జనవరి నాటికి ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
ఘాట్‌రోడ్ల ద్వారా రాకపోకలు సాగించే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొండ చరియలు విరిగిపడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. చరియలు విరిగిపడే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. పరకామణి విభాగంలో లెక్కింపు మినహా మిగిలిన అన్ని కార్యక్రమాలు ఔట్‌సోర్సింగ్ వారిద్వారా చేయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుమల, తిరుపతి జేఈఓలు శ్రీనివాసరాజు, పోల భాస్కర్, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి ఎస్టేట్ ఆఫీసర్ గౌతమి, సీవీఎస్‌వో ఆకె రవికృష్ణ, విద్యుత్ విభాగం అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment