- నేటితో ముగియనున్న గడువు
- వెంకటరమణ నివేదిక తిరస్కృతి
- నివేదికే ఇవ్వనివారు మరో 28మంది
చిత్తూరు(కలెక్టరేట్): జిల్లాలో ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల నివేదికను సమర్పించేం దుకు ఎన్నికల సంఘం విధించిన గడువు ఆదివారంతో ముగియనుంది. జిల్లాలో మొత్తం 203 మంది అభ్యర్థులు వారి ఖర్చుల నివేదికలను సమర్పించాల్సి ఉం డగా, ఇప్పటివరకు 175 మంది వారి ఖర్చుల నివేదికలను సమర్పించి ఎన్నికల నోడల్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందారు.
ఇంకా 28 మంది లెక్కల నివేదికలు సమర్పించలేదు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ఎం.వెంకటరమణ ఖర్చుల నివేదికలో తేడాలున్నాయని తిరస్కరించారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడి పాల్గొన్న సభకు అయిన ఖర్చులను వెంకటరమణ ఖాతాలో వేశారు.
అరుుతే వెంకటరమణ ఆ సభ ఖర్చులు తనకు సంబంధం లేదని, వేదిక మీద ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారని కలెక్టర్ కే.రాంగోపాల్‌కు విన్నవించినట్లు సమాచారం. దీంతో ఆ సభ ఖర్చులను వేదిక మీద ఉన్న అభ్యర్థుల ఖర్చుల్లో సర్దుబాటు చేయూలని కలెక్టర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు సూచించినట్లు సమాచారం. ఎంతైనా అధికార పార్టీ కదా ఎన్నికల వ్యయ పరిశీలకులు, సంబంధిత ఆర్వోలు నివేదిక సర్దుబాటుకు కృషి చేస్తున్నట్లు తెలిసింది.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో పోటీచేసిన అభ్యర్థుల్లో ముగ్గురు, నగరి, మదనపల్లెలో ఇద్దరు చొప్పున, పీలేరులో నలుగురు వారి ఖర్చుల నివేదికను ఇంకా ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించలేదని ఎన్నికల యంత్రాంగం తెలిపింది. జీడీ నెల్లూరు,పలమనేరు, సత్యవేడు,చంద్రగిరిల్లో ముగ్గురు చొప్పున,చిత్తూరు,పూతలపట్టులో ఒక్కొక్కరు వంతున, రాజంపేట పార్లమెంటు పరిధిలో ముగ్గురు ఖర్చుల వివరాలను సమర్పించలేదని పేర్కొంది.