ప్రజాహితమైతే ఓకే.. లేదంటే వాతే.. | let us go with pro people stand, suggests ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ప్రజాహితమైతే ఓకే.. లేదంటే వాతే..

Published Thu, Jun 19 2014 1:55 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ప్రజాహితమైతే ఓకే.. లేదంటే వాతే.. - Sakshi

ప్రజాహితమైతే ఓకే.. లేదంటే వాతే..

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం
ప్రజలకు ఉపయోగ పడే పనులు చేస్తే ప్రభుత్వానికి సహకారం
ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ సూచన

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాహితమైన పనులు చేస్తే సంపూర్ణంగా సహకరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం నిర్ణయించింది. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే ప్రజలపక్షాన నిలబడి ప్రతిఘటించాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీఎల్పీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రెండు గంటల పాటు శాసన సభాపక్ష సమావేశం జరిగింది. గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసన సభ తొలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. రాష్ర్టంలో వడగాడ్పులకు మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించింది. సుమారు 60 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన ఈ సమావేశంలో ప్రజలు తమకు అప్పగించిన ప్రతిపక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించారు. రైతుల రుణాల మాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు అధికారపక్షమైన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు క్రమం తప్పకుండా శాసన సభ, మండలి సమావేశాలకు హాజరవ్వాలని, చర్చల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని సభ్యులకు సూచించారు. ప్రభుత్వ శాఖలు, వాటి పనితీరును శ్రద్ధతో అవగాహన చేసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని చెప్పారు.

ప్రతిపక్షమంటే ఎలా ఉండాలో చాటుతాం: నెహ్రూ

 పరతిపక్షం అంటే ఎలా ఉండాలో మొత్తం దేశానికే చాటి చెప్పేలా శాసనసభలో వ్యవహరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు. శాసనసభాపక్ష సమావేశం అనంతరం సహచర ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆర్.కె.రోజా, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, బూడి ముత్యాలనాయుడుతో కలసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శాసన సభాపక్ష సమావేశంలో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించామన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలని, ఒక బలమైన ప్రతిపక్షంగా తమ పార్టీకే దానిని కేటాయించాలని అన్నారు. అయితే ఆ పదవిని తమకు ఇస్తారా లేదా అనే విషయాన్ని అధికారపక్షం విచక్షణకే వదలేస్తున్నామని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైతుల రుణ మాఫీ అమలుకు ప్రభుత్వంపై ఎలా పోరాడతారని ప్రశ్నించగా.. గురువారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో మీరే చూస్తారని ఆయన జవాబిచ్చారు.

శోభానాగిరెడ్డి పేరు లేకపోవడంపై అభ్యంతరం

శాసన సభసమావేశాల ఎజెండాలో సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత ప్రవేశపెట్టే సంతాప తీర్మానంలో ఆళ్లగడ్డ నుంచి ఎన్నికైన దివంగత భూమా శోభా నాగిరెడ్డి పేరు లేకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శాసనసభాపక్షం సమావేశం ముగిసిన తరువాత అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించడానికి ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, జలీల్‌ఖాన్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొక్కిలిగడ్డ రక్షణ నిధి తదితరులు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వెళ్లారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే సంతాప తీర్మానాల్లో ప్రమాణ స్వీకారానికి ముందే మరణించిన టీడీపీ సభ్యుడు తంగిరాల ప్రభాకర్ పేరు పెట్టి, శోభా నాగిరెడ్డి పేరు ఎందుకు పెట్టలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి (ఇన్‌చార్జి) కె.సత్యనారాయణరావును ప్రశ్నించారు. ఇందులో తన ప్రమేయం లేదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించడమే తన విధి అని సత్యనారాయణ వారికి చెప్పారు. ఈ విషయంపై భూమా నాగిరెడ్డి శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడుతో ఫోన్‌లో మాట్లాడగా.. సభా నిబంధనలను పరిశీలించి చెబుతానని చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ కార్యదర్శితో కలసి వారు శాసన సభ ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement