షాడో డీటీసీ! | Lets say the office of the accountant RTA | Sakshi
Sakshi News home page

షాడో డీటీసీ!

Published Mon, Apr 4 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

షాడో డీటీసీ!

షాడో డీటీసీ!

ఎనిమిదేళ్లుగా ఒకే సీటులో..
ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్ చెప్పిందే వేదం
ఉన్నతాధికారి పేరుతో ఇష్టారాజ్యంగా వసూళ్లు
 హడలిపోతున్న రవాణాశాఖ ఉద్యోగులు

 
 నెల్లూరు (టౌన్): ఎనిమిదేళ్లుగా ఆయన రవాణాశాఖ కార్యాలయంలో ఒకే సెక్షను సీటులో పనిచేస్తున్నాడు. ఆ శాఖకు ఏ ఉన్నతాధికారి వచ్చినా ఆయన మాట వినాల్సిందే. ఎంతమంది ఉద్యోగుల బదిలీ అయినా ఆయన మాత్రం ఆ సీటుకు అతుక్కుని పోయాడు. ఉన్నతాధికారి పేరు చెప్పి ఆ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల నుంచి స్పెషల్ వర్క్‌ల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. అక్కడ అందరూ ఈ ఉద్యోగిని షాడో డీటీసీగా పిలుస్తుంటారు. స్పెషల్ వర్క్‌లు పేరుతో అందరి దగ్గర వసూళ్లు చేసి ఉన్నతాధికారికి రోజుకు రూ.50 వేల అనధికార మొత్తాన్ని ఇస్తుండటంతో పాటు తన కమీషన్ కింద రూ. 5వేలు జేబులో వేసుకుంటున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు గుసుగుసలాడుకుంటున్నారు. దీంతో పాటు ఈయన చూస్తున్న ట్రాక్టర్ల సెక్షనులో రోజుకు మరో రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఉద్యోగి చేయాల్సిన ట్రెజరీ పనులన్నీ ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుకు అప్పజెప్పి రోజంతా ఉన్నతాధికారి వసూళ్లల్లో మునిగి తేలుతారని తోటి ఉద్యోగులే చెబుతున్నారు. ఈ షోడో డీ టీసీ పేరు చెబితేనే ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు హడలిపోతున్నారు. నెల్లూరు ఉపరవాణాశాఖా కార్యాలయంలో అకౌంట్స్ సెక్షనులో ఆయన 2008లో బాధ్యతలు చేపట్టారు.

అప్పటి నుంచి ఇప్పటి దాకా అదే సెక్ష నులో పనిచేస్తున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ముగ్గురు ఉన్నతాధికారులు మారినా అకౌంట్స్ సెక్షనులో ఇప్పటికీ ఆ ఉద్యోగి ఉండటంపై రవాణాశాఖలో చర్చనీయాంశమైంది. రవాణాశాఖలో ఉన్నతాధికారికి కార్యాలయంలో ఆయా సెక్షన్లకు సంబంధించి అనధికార వసూళ్లు మొత్తం ఈ ఉద్యోగి ద్వారానే చేరుతాయని పలువురు చెబుతున్నారు. లారీల రిజిస్ట్రేషన్లు, బస్సుల పర్మిట్లు, ఎన్‌ఓసీలు, జేసీబీలు, పెద్ద,పెద్ద మిషన్ల వరకు కాగితాలు సక్రమంగా లేకపోయినా ఈ ఉద్యోగిని కలిస్తే చాలు. ఆయన చెప్పిన ప్రకారం డబ్బులు ఇస్తే ఆ పని క్షణాల్లో పూర్తవుతుంది. ఆ పనికి సంబంధించిన సెక్షను ఉద్యోగి కూడా ఈయన ఎంటర్ అవడంతో నోరెత్తకుండా పనిచేసిపెడతారు. ఉదాహరణకు వాహనం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ కావాలంటే రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కనీసం ఏడాదిన్నర సమయం ఉండాలి.


అలా లేకుంటే వాణిజ్యపన్నుల శాఖలో ట్యాక్స్‌కట్టి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురావల్సి ఉంది. ఈ పనికి సంబంధించి ఈయనను కలిసి చెప్పిన అనధికార మొత్తాన్ని చెల్లిస్తే పని పూర్తి చేశారు. ఈ రీతిలో స్పెషల్ వర్క్‌ల పేరుతో ఉన్నతాధికారికి అన్ని సెక్షన్లు నుంచి రోజుకు రూ.50 వేల మేర వసూలు చేసి దాంట్లో రూ.5వేలు తన ఖాతాలో వేసుకుంటారని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులపై ఉన్నతాధికారికి చాడీలు చెబుతుండటంతో ఈయన అంటేనే అక్కడ పనిచేసే ఉద్యోగులు హడలిపోతున్నారు. డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేసి తెచ్చి ఇస్తుండటంతో ఉన్నతాధికారి ఆ ఉద్యోగి చెప్పినదానికల్లా తల ఊపుతారంటున్నారు.


 ట్రెజరీ పనులు సెక్యూరిటీ గార్డుకు అప్పగింత
 రవాణాశాఖలో అకౌంట్స్ విభాగం కీలకం. అక్కడ ఉద్యోగులు, కార్యాలయానికి సంబంధించిన కీలక లావాదేవీలు, పత్రాలు ఉంటాయి.  ఈ సెక్షనులో పనిచేస్తున్న ఉద్యోగి ట్రెజరీ బాధ్యతలను ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుకు అప్పజెప్పా రు. సెక్యూరిటీ గార్డే ప్రతిరోజూ ట్రెజరీకి వెళ్లి రవాణా కార్యాలయానికి సంబంధించిన అన్ని పనులను చక్కబెడుతున్నారు. క్యాష్ మాత్రం గుమస్తాకు అప్పజెబుతున్నారు. ఉద్యోగులు, కార్యాలయానికి సంబంధించిన పత్రాలు కూడా బయట వ్యక్తుల చేత పంపించకూడదన్న నిబంధన ఉంది. అయినా ఈ ఉద్యోగి అవేమీ పట్టించుకోరు. ఉన్నతాధికారి వసూళ్లలో నిమగ్నమవుతారు. ఉన్నతాధికారిని ప్రతిరోజూ ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి తప్పులు చేసినా పట్టించుకోరన్న ప్రచారం సాగుతోంది. ఈయన బారినుంచి రక్షించాలని ఆ శాఖ ఉద్యోగులు వేడుకుంటున్నారు.


 వసూళ్లు విషయంపై పరిశీలిస్తాం : శివరాంప్రసాద్, ఉపరవాణా కమిషనర్
కార్యాలయంలో నాపేరు చెప్పి వసూలు చేస్తున్నారనే విషయం తెలియదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ట్రెజరీకి వెళ్లేందుకు గుమస్తాను ప్రత్యేకంగా నియమించాం. సెక్యూరిటీ గార్డును ఎందుకు పంపిస్తున్నారో అడిగి తెలుసుకుంటా. ప్రైవేటు వ్యక్తులను ట్రెజరీకి పంపించకూడదు. అకౌంటెంట్‌గా ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఆయన ఉంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement