యాచారం, న్యూస్‌లైన్: మీరు కుక్కను పెంచాలనుకుంటున్నారా.. అయితే లెసైన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మీ కుక్కను గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టుకెళ్లిపోతారు. వీధి కుక్కలను నిర్మూలించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం.. లెసైన్స్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయాలకు ఈ ఆదేశాలు అందాయి. ఒక వేళ లెసైన్స్ తీసుకున్నా.. పరిసర ప్రాంత వాసులకు కుక్కనుంచి ఇబ్బంది కలుగుతున్నట్టు ఫిర్యాదు అందితే వెంటనే దాన్ని తీసుకెళ్లిపోతారు.
వీధి కుక్కలతో అనేక ఇబ్బందులు
గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్న పిల్లలపై, పాడిపశువులపై దాడి చేస్తున్నాయి. కొన్నిసార్లు ఒకే కుక్క పదుల సంఖ్యలో జనాలను గాయపరుస్తున్నది. గ్రామాల శివారుల్లో ఏర్పాటైన కోళ్ల ఫారాల సమీపాల్లో చనిపోయిన కోళ్లను తింటున్న కుక్కలు పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి. మేకలు, ఆవు దూడలపై దాడులు చేస్తున్నాయి. యాచారం, నక్కర్త మేడిపల్లి, తక్కళ్లపల్లి, మల్కీజ్‌గూడ, చౌదర్‌పల్లి, గునుగల్, మాల్ తదితర గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది.
రెండేళ్ల కాలంలో మండలంలో పలు గ్రామాల్లో 50మందికి పైగా కుక్కల బారిన పడ్డారు. చౌదర్‌పల్లి, నక్కర్త మేడిపల్లి గ్రామాల్లో వీటి బెదడ మరీ ఎక్కువ. నక్కర్త మేడిపల్లి, ధర్మన్నగూడ, నందివనపర్తి తదితర గ్రామాల్లో గొర్రెల మందలపై దాడులు చేసిన సందర్భాలు అనేకం. ఒక్కో ఘటనలో పది నుంచి ఇరవై వరకు గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. దీంతో పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై మేకలు, గొర్రెల పెంపకందారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ రాజ్ చట్టం 1994 సెక్షన్ (92) ప్రకారం కుక్కల పెంపకం కోసం లెసైన్స్ తీసుకున్నా.. వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే చర్యలకు గ్రామ పంచాయతీకి పూర్తి అధికారాలు ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏ గ్రామంలో ఎన్ని కుక్కలు..
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఈఓఆర్డీ శంకర్‌నాయక్.. ఆయా పంచాయతీ కార్యదర్శుల నుంచి సమాచారం కోరారు. ఏ గ్రామంలో ఎన్ని కుక్కలు ఉన్నాయి.. ఇప్పటి వరకు వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగాయా వంటి వివరాలు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా కుక్కలతోపాటు పందుల నివారణకు కూడా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో పందులు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.
ఆదేశాలు అందాయి..
కుక్కలను నిర్మూలించాలని ఉ న్నతాధికారుల నుంచి ఆదేశా లు అందాయి. వెంటనే ఆయా పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశాం. గతంలో ప లు గ్రామాల నుంచి వీధికుక్కలు, పందుల బెడద నుంచి కాపాడాలని ఫిర్యాదులు అందాయి. అందుకే వెంటనే చర్యలు ప్రారంభించాం.
- శంకర్‌నాయక్, ఈఓఆర్డీ, యాచారం
కుక్కను పెంచాలంటే లెసైన్స్ ఉండాల్సిందే
Published Sat, Sep 28 2013 2:47 AM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM
Advertisement
Advertisement