
21 మంది టీడీపీ నాయకులకు జీవిత ఖైదు
- బంగారయ్యపేట ఘర్షణలో కోర్టు తుది తీర్పు
- ముద్దాయిల్లో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు
నక్కపల్లి/అనకాపల్లి (విశాఖ జిల్లా): బీచ్ మినరల్స్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణానికి సంబంధించిన కేసులో పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుతో పాటు మరో 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ మేరకు విశాఖ జిల్లా అనకాపల్లి 10వ అదనపు జిల్లా జడ్జి, సెషన్స్ కోర్టు జడ్జి బి.వి. నాగేంద్రరావు బుధవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారయ్యపేట మత్స్యకార గ్రామంలో సముద్రపు ఇసుక నుంచి మినరల్స్‌ను వెలికితీసేందుకు చెన్నైకి చెందిన బీఎంసీ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది.
ఇసుక తవ్వకాలను గ్రామంలో ఒక వర్గం వ్యతిరేకించగా మరో వర్గం మద్దతు తెలిపింది. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించే వర్గం అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు ఆధ్వర్యంలో 2007 అక్టోబర్ 18న గ్రామంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరస్పర దాడుల్లో కంపెనీ అనుకూల వర్గానికి చెందిన గోసల కొండ అనే వ్యక్తి మరణించాడు. మృతుడి కుమారుడు గోసల గోవిందు అదే రోజు నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు అప్పటి ఎమ్మెల్యే చెంగల వెంకటరావుతోపాటు గ్రామానికి చెందిన మరో 23 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా 21 మందిపై కేసు కొనసాగింది. అనకాపల్లి సెషన్స్ సీనియర్ సివిల్ జడ్జి బుధవారం తుది తీర్పు వెల్లడించారు. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కో ముద్దాయి రూ.5 వేల వంతున జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో మరో ఏడాది జైలు అనుభవించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.