
ఇసుక అక్రమ నిల్వలు
ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపేశారు.. సముద్రపు ఇసుక నుంచి రూ.కోట్లు పిండేసుకున్నారు. ఈ తంతు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో సంబంధిత శాఖ అధికారులు సదరు కంపెనీకి భారీగా జరిమానా వడ్డించారు.. దాంతో ఆ కంపెనీ పెద్దలు ఆ శాఖ మంత్రి సన్నిహితుల ద్వారా ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. ఇంకేముంది రూ.3.10 కోట్ల జరిమానా కాస్తా రూ.8 లక్షలకు తగ్గిపోయింది. సర్కారు పెద్దలు అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తుతూ.. ‘పచ్చ’ తివాచీ పరుస్తున్న తీరుకు ఇదో మచ్చుతునక. జిల్లాపరిషత్ సమావేశంలోనూ తీవ్ర చర్చకు తెరలేపిన ఈ ఈ తంతు ఎలా సాగిందంటే..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సముద్రపు ఇసుక నుంచి విలువైన గార్నెట్ ఖనిజం తీసి విదేశాలకు ఎగుమతి చేసే బీచ్ మినరల్స్ కంపెనీ ఆంధ్రా ప్రైవేటు లిమిటెడ్‌ను నక్కపల్లి మండలం బంగారయ్యపేటలో పదిహేనేళ్ల కిందట నెలకొల్పారు. వాస్తవానికి ఆ కంపెనీకి అనుమతులివ్వడంపైనే వివాదముంది. కంపెనీ మైనింగ్‌కు అనుమతి పొందిన బంగారయ్యపేట పంచాయతీ గునుపూడి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్లు 188, 192ల్లో వాస్తవానికి శాండ్ మినరల్స్ తవ్వే పరిస్థితి లేదు. నిబంధనల మేరకు గ్రామానికి 500 మీటర్ల ఆవల ఉంటే కానీ.. ఖనిజాల తవ్వకాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ బీచ్ మినరల్స్ కంపెనీ లీజుకు తీసుకున్న దాదాపు 4.3 హెక్టార్ల భూమి గునుపూడి గ్రామానికి వంద మీటర్లలోపు దూరంలోనే ఉంది.
నిబంధనల మేరకు అక్కడ మైనింగ్ చేసే అవకాశం లేదు. కానీ బీచ్ మినరల్స్ కంపెనీ అక్కడే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మధ్యమధ్యలో నిలిపివేసి మళ్లీ గ్రామస్తుల కళ్ళుగప్పి మైనింగ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చిలో తవ్వకాలు చేపట్టి ఎగుమతులు చేస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. అక్రమ తవ్వకాలు, అడ్డగోలు ఎగుమతలు చేస్తున్న కంపెనీపై 3కోట్ల 10లక్షల 34వేల 420 రూపాయలు జరిమానాగా విధించారు. దాంతో కంపెనీ ప్రతినిధులు ఓ మంత్రి బంధువును సంప్రదించారు. ఆయన ద్వారా మంత్రిని, ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. అంతే ఆ మొత్తం పెనాల్టీని మాఫీ చేసేసి కేవలం రూ.8లక్షలు చెలిస్తే చాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. అంటే దాదాపు 98 శాతం జరిమానా మాఫీ చేసేశారన్నమాట!. ఈ మేలు చేసినందుకు గాను సదరు మంత్రికి ఓ కోటి ముట్టజెప్పి రెండుకోట్లు మిగుల్చుకున్నకున్నట్టు తెలుస్తోంది.
అది ప్రభుత్వ నిర్ణయం
ఇదే విషయమై గనులశాఖ అధికారిని సాక్షి ప్రశ్నిస్తే.. అది ప్రభుత్వ నిర్ణయం... దయచేసి మమ్మల్ని ఇన్‌వాల్వ్ చేయకండని విజ్ఞప్తి చేశారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో మాట్లాడగా.. ‘మా పని మేం చేశాం. జరిమానా విధించి గనులశాఖకు అప్పజెప్పం. అక్కడితో మా పని అయిపోయింది. ఆ తర్వాత మాకు సంబంధం లేదు’ అని చెప్పుకొచ్చారు.