వెలుగు.. వెలవెల | Light .. Naturally | Sakshi
Sakshi News home page

వెలుగు.. వెలవెల

Published Mon, May 26 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

వెలుగు.. వెలవెల

వెలుగు.. వెలవెల

  •      150 ఏళ్లనాటి దీపస్తంభం
  •      పదేళ్ల క్రితం చోరీతో అస్తవ్యస్తం
  •      ఎన్ని మరమ్మతులు చేసినా కాంతిహీనం
  •      మత్స్యకారులకు తీవ్ర అసౌకర్యం
  •  తెల్లదొరలు ఏర్పాటు చేసిన ఆ లైట్‌హౌస్ అలనాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అంతే కాదు.. ఇప్పటికీ సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు దిక్సూచిగా ఉపయోగపడుతోంది. అయితే పదేళ్ల క్రితం చోరులు విలువైన పరికరాలను దొంగిలించుకుపోవడంతో ఆ దీపస్తంభం వెలుగు తగ్గింది. అప్పటి నుంచి ఎన్ని మరమ్మతులు చేసినా అది వెలవెలపోతోంది. దాంతో చేపలవేటకు వెళ్తున్న మత్స్యకారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
     
     భీమునిపట్నం, న్యూస్‌లైన్:  సముద్రంలో దారి తెలియని నౌకలకు దిక్సూచిగా నిలిచే ఆ దీపస్తంభానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రాచీన పట్టణమైన భీమిలిలో బ్రిటిష్ వారు దానిని ఏర్పాటు చేసి నూట ఏభై ఏళ్లకు పైగానే అయింది. అప్పటి నుంచి నిరాఘాటంగా వెలుగులు విరజిమ్ముతున్న లైట్‌హౌస్ కాంతిహీనం కావడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

    1854ప్రాంతంలో బ్రిటిష్ వారు ఇక్కడ పోర్టు ఏర్పాటు చేసి ఓడల ద్వారా ఎగుమతులు, దిగుమతులు నిర్వహించేవారు. ఆ నౌకల కోసం ఇక్కడ బీచ్ సమీపంలో లైట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. అరుదైన బ్రిటిష్ పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేయడంతో దీని కాంతి ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని నిర్వహణ కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి లైట్‌హౌస్ నిర్వహణ బాధ్యతను వారే చేపట్టారు.
     
    భీమిలి తీరప్రాంతంలో నిత్యం నాటుపడవలు, తెప్పల ద్వారా చేపలవేట సాగించే మత్స్యకారులకు లైట్‌హౌస్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వారిలో చాలామంది వేకువనే సముద్రంలోకి వెళ్లి మధ్యాహ్నం తీరానికి వస్తారు. మరికొందరు సాయంత్రం వెళ్లి అర్ధరాత్రి ప్రాంతంలో తీరానికి వస్తారు. వీరందరికీ ఈలైట్‌హౌస్ వెలుగే ఆధారం. పదేళ్ల క్రితం ఈ లైట్‌హౌస్‌లో దొంగలు పడి ఇందులోని యంత్రాల సామగ్రిని పట్టుకుపోయారు.

    కాకినాడ పోర్టు సిబ్బంది దీనికి మరమ్మతులు నిర్వహించినా మునుపటంత వెలుగివ్వడం లేదని మత్స్యకారులు అంటున్నారు. రాను రాను ఇది మరింత కాంతిహీనం కావడంతో మత్స్యకారులకు మరింత కష్టంగా మారుతోంది. ఇక్కడ తీరప్రాంతంలో రాళ్లు ఎక్కువగా ఉండడంతో దారి సక్రమంగా తెలియక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్య గురించి అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందని మత్స్యకారులు అంటున్నారు.
     
    పాత లైట్‌హౌస్ పరిస్థితి ఇలా ఉంటే, గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి చెందిన లైట్‌హౌస్ విభాగం అధికారులు ఇక్కడకు వచ్చి వందఅడుగుల ఎత్తులో సరికొత్త లైట్‌హౌస్‌ను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం చేరువలో స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. కానీ తర్వాత ఎవరూ ఇటువైపు దృష్టి మరల్చలేదు. ఈలోగా పాత లైట్‌హౌస్‌కు రెండు నెలల క్రితం కొన్ని మరమ్మతులు చేసి రంగులు వేశారు. దాంతో ఇది చూడడానికి అందంగా ఉన్నా పనితీరు అలాగే ఉంది. మరింత వెలుగిచ్చేట్టు దీనిని తీర్చిదిద్దాలని మత్స్యకారులు కోరుతున్నారు.
     
     కష్టంగా ఉంది..
     లైట్‌హౌస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల భీమిలి తీరంలో వేటాడే మత్స్యకారులకు కష్టంగా ఉంది. కాంతి తగ్గడంతో తీరానికి చేరుకోవడం సమస్యగా ఉంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
     -బుంగ అప్పారావు, మత్స్యకారుడు.
     
     నిర్లక్ష్యం వల్లే దుస్థితి..

     అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికైనా లైట్ హౌస్ మరమ్మతులపై దృష్టి పెట్టాలి.
     -వాడమొదల సత్యారావు, మత్స్యకారుడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement