- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నాన్చుడే కారణం
- ఈసెట్, ఎంసెట్‌లపై చూపనున్న ప్రభావం
నర్సీపట్నం : పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ పూర్తయి పది రోజులైనా ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటించలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇదే పరిస్థితి కొనసాగితే ఈసెట్, ఎంసెట్‌లపై ప్రభావం పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ దఫా పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌ను ముందుగా చేపట్టారు.
జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఈ నెల 9 నుంచి 18 వరకు కౌన్సెలింగ్‌ను పూర్తిచేశారు. కౌన్సెలింగ్ జరిగిన మూడు కేంద్రాల్లో సుమారు 3 నుంచి 4 వేల మంది వరకు విద్యార్థులు ధ్రువపత్రాల రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని ఆప్షన్లను ఎంచుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తరువాత గడువును రెండ్రోజులు అదనంగా ఈనెల 22 వరకు పొడిగించారు. ఆ మర్నాడే జాబితా ప్రకటిస్తామని పేర్కొన్న ప్రభుత్వం వారం రోజులవుతున్నా రోజూ వాయిదా వేస్తూ వస్తోంది.
వాస్తవంగా ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే ఉత్తర్వుల్లో ఎంత ఫీజు చెల్లించాలో ప్రకటిస్తారు. గతంలో ఆప్షన్లు పూర్తయిన వెంటనే జాబితా ప్రకటించేవారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. దీనివల్ల ఏ కులం విద్యార్థులు ఎంత మేర ఫీజు చెల్లించాలో ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనివల్ల ఎంపికయిన విద్యార్థుల జాబితా ఇంకా ప్రకటించలేదు. గత ఏడాదికన్నా ముందుగా కౌన్సెలింగ్ ప్రారంభించినా ఇంతవరకు జాబితా ప్రకటించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
దీని ప్రభావం పరోక్షంగా ఈసెట్, ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈసెట్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసినా వాయిదా వేస్తూ వస్తోంది. గతంలో ప్రకటించినట్టు ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 29నుంచి జరిగే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.