
సాక్షి, విశాఖపట్నం: శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలవుతోంది. బడిలో పిల్లలు ఆకలితో ఆవురావురంటున్నారు. భోజనం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో అన్నంతో నిండిన బేసిన్లు వచ్చాయి. ఇక వడ్డనకు సిద్ధమవుతుండగా ‘ఆపండి ఆపండి.. పిల్లలకు భోజనం వడ్డించకండి’ అంటూ హెడ్మాస్టర్ల నుంచి ఆదేశం! ఏమయిందో తెలియక పిల్లలంతా ఆందోళన.. ఆశ్చర్యం!! కాసేపటికి తెలిసింది... జీవీఎంసీ స్కూళ్లలో పిల్లలకు ఇస్కాన్ సంస్థ సరఫరా చేసే మధ్యాహ్న భోజనంలో బల్లి పడిం దని. దీంతో ఆ భోజ నాన్ని పిల్లలకు వడ్డించకుండా నిలిపివేశారు.
అసలే జరిగిందంటే..
నగరంలోని ప్రకాశరావుపేట మున్సిపల్ పాఠశాలలో పిల్లలకు తెచ్చిన మధ్యాహ్న భోజనంలో బల్లి పడినట్టు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్తించారు. వెంటనే సాటి ఉపాధ్యాయులతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) బి.లింగేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. డీఈవో అప్రమత్తమై జీవీఎంసీ విద్యాశాఖ అధికారులకు, ఆయా మున్సిపల్ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు ఫోన్ల ద్వారా ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. శుక్రవారం ఇస్కాన్ సంస్థ సరఫరా చేసిన మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు వడ్డించవద్దని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఆ సందేశాలను అందుకున్న ఉపాధ్యాయులు ఎక్కడికక్కడే ఆ భోజనం పిల్లలకు అందజేయకుండా నిలిపివేశారు. మధ్యాహ్న భోజనానికి బదులు అరటిపళ్లు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేసి వారి ఆకలి తీర్చారు. జీవీఎంసీ పరిధిలో 147 మున్సిపల్ స్కూళ్లున్నాయి. వీటిలో 69 పాఠశాలలకు ఇస్కాన్, మిగిలిన వాటికి అక్షయపాత్ర సంస్థలు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాయి. ఇస్కాన్ సంస్థ ఈ 69 స్కూళ్లలో సుమారు 15 వేల మంది పిల్లలకు భోజనం సమకూరుస్తోంది.
విచారణ జరుపుతున్నాం
ప్రకాశరావుపేట మున్సిపల్ స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో బల్లి పడినట్టు ఆ పాఠశాల హెడ్మాస్టార్ గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమై ఇస్కాన్ సరఫరా చేస్తున్న ఆయా మున్సిపల్ స్కూళ్లలో పిల్లలకు భోజనం వడ్డించ వద్దని ఆదేశాలిచ్చాం. ఇస్కాన్ సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడ పరిసరాలను పరిశీలించాను. ఎక్కడా అపరిశుభ్రత కనిపించలేదు. ఇస్కాన్ నిర్వాహకులకు నోటీసులిచ్చాం. బల్లి పడిన ఘటనపై విచారణ జరుపుతున్నాం.– బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment