- జిల్లా టీడీపీలో నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు
- వుడా,మార్కెట్,దేవాలయ కమిటీలు, గ్రంథాలయసంస్థ చైర్మన్ పోస్టులపై గురి
- లాభదాయక పదవులకు రూ.4 కోట్లలోపు ఖర్చుకు రెడీ
సాక్షి, విశాఖపట్నం: జిల్లా టీడీపీలో నామినేటెడ్ పదవులకోసం పోటీ ఎక్కువవుతోంది. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న శ్రేణులు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏదో ఒక పదవిని దక్కించుకునేందుకు తీవ్రంగా పావులు కదుపుతున్నారు. ఎవరికివారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దేవాలయ ట్రస్ట్ బోర్డులు,పాలకమండళ్లు, గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీలు, జీసీసీ, వుడా చైర్మన్ పదవులు, తదితర కీలక పదవులపై గురిపెట్టారు. ఎమ్మెల్యేలు,మంత్రులద్వారా పని చేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. లాభదాయకమైన పోస్టుల కోసం కోట్లు వెచ్చించడానికైనా సై అంటున్నారు. కీలకమైన నామినేటెడ్ పోస్టు రూ.2 కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ధర పలుకుతోంది.
ఏ పదవైనా ఓకే... : జిల్లాలో సుమారు 4,200 నామినేటెడ్ పదవులున్నాయి. వాటిల్లో అధిష్టించి ఉన్న వారందరినీ తప్పుకోవాలని ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఒకవేళ రాజీనామా చేయకపోతే బలవంతంగానైనా తప్పిస్తామంటోంది. దీంతో సుమారు 412 పదవులు ఖాళీ కా నున్నాయి. ముఖ్యంగా జిల్లాలో 45 ఆలయాలకు పాలకమండళ్లు ఉన్నాయి. ఈ పదవులను కైవసం చేసుకోవాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)ల్లో ప్రస్తుతం 30 మంది ఉన్నారు. నాలుగింటిలో అసలు నియామకాలు లేవు.
వీటన్నింటిలో ఎలాగైనా పదవులు దక్కించుకోవడానికి నియోజకవర్గాల వారీ టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. 1700 మందికిపైగా ఆదర్శరైతుల ను తొలగిస్తుండడంతో వాటిపైనా కన్నేశారు. అన్నింటికి మించి అత్యధిక ఆదాయం ఇచ్చే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు 1500 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్న వారిని తప్పిస్తుండడంతో ఏదొక మండలంలో పోస్టింగ్ కోసం నేతలు,కార్యకర్తలు ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు.
ఇవన్నీ కాకుండా విశాఖలో అత్యంత కీలకమైన వుడా చైర్మన్ పోస్టు సుమారు పదేళ్ల నుంచి ఖాళీగా ఉంది. ఇటీవల ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు దీని కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదికాక జీసీసీ పోస్టు కోసం టిక్కెట్ దక్కని సీనియర్ నేతలు హైదరాబాద్‌కు వెళ్లి మరీ ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రంథాలయసంస్థ చైర్మన్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇలా సుమారు అన్నీ కలిపి నాలుగువేలకుపైగా చిన్నాపెద్దా పదవులుండడంతో వీటిలో ఏదొకటి సా ధించేందుకు నేతలు పైరవీలు సాగిస్తున్నారు. లాభదాయకమైన పదవుల విషయంలో పోటీ మరీ తీవ్రంగా ఉంది. వీటికి ఎంతైనా ఖర్చుచేయడానికి నేతలు వెనుకాడడంలేదు.