ప్రజాప్రతినిధులు లేకుండా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఏపీ పంచాయతీరాజ్
విజయనగరం మున్సిపాలిటీ : ప్రజాప్రతినిధులు లేకుండా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి.అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈవిషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయాలకు అతీతంగా పని చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ.రమేష్‌ను కలిసిన ఆయన పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థ ఖాళీలకు ఉప ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. దీంతో 1326 సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు స్థానాలు భర్తీకి నోచుకోక పాలన కుంటుపడే పరిస్థితి దాపురించిందన్నారు. ఏడాది కాలం పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషనర్ లేకనే ఎన్నికలు నిర్వహించడం లేదన్న ప్రభుత్వం కమిషనర్ నియామకం చేపట్టి ఆరునెలలు కావస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి రాష్ట్రంలో అనుకూల వాతావరణం లేకనే ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సాహసించడం లేదన్నారు. ఈవిషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ చొరవ చూపించి తక్షణమే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలతో పాటు న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కమిషనర్‌ను కలిసిన వారిలో చాంబర్ సభ్యులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.