మే 13న ప్రాదేశిక ఫలితాలు!
-
ఒక రోజు అటూ ఇటుగా మున్సిపల్ ఫలితాలు
-
మే 16 నుంచి 31లోగా మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక
-
ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎవరుండాలి?
-
న్యాయ సలహా తీసుకుని చెప్పాలని రాష్ర్ట సర్కారుకు ఈసీ లేఖ
హైదరాబాద్: స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ మధ్యలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాకే ‘స్థానిక’ ఫలితాలను ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మే 7తో తుది దశ ఎన్నికలు ముగుస్తున్నందున స్థానిక ఫలితాల కసరత్తుపై ఈసీ ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.
ఇక మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల తర్వాత పరోక్ష పద్ధతిలో మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇందులో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ప్రస్తుతమున్న ఎమ్మెల్యే, ఎంపీలకు అవకాశమివ్వాలా? లేక మే 16న సార్వత్రిక ఫలితాల వెల్లడితో కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు అవకాశమివ్వాలా? అన్నది చిక్కు ప్రశ్నగా మారింది. దీనిపై స్పష్టతనివ్వాలని కోరుతూ రాష్ర్ట ప్రభుత్వానికి ఈసీ తాజాగా లేఖ రాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్త సమస్య ఎదురైనందున.. దీనిపై న్యాయ సలహా తీసుకుని తమకు సూచించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ కోరారు.
ప్రస్తుత ఎమ్మెల్యేల పదవీ కాలం జూన్ రెండుతో ముగుస్తుందని, ఎంపీల కాలపరిమితి మే 31తో ముగుస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను వచ్చే నెల 13న వెల్లడించడానికి ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి ఒక రోజు అటూ ఇటుగా మున్సిపల్ ఫలితాలను వెల్లడించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఏడో తేదీన సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినా.. ఏదైనా కారణంతో రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే 9న నిర్వహిస్తారని, ఆ తర్వాతి రెండు రోజులు వారాంతం కావడంతో మే 11 తర్వాతే జిల్లాల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి అవకాశముందని ఈసీ తన లేఖలో పేర్కొంది.
మే 16న సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున అంతకుముందే స్థానిక సంస్థల ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 12 నుంచి 15 మధ్యే ఇందుకు వీలు కుదరనుంది. ఇక మేయర్, చైర్‌పర్సన్‌ల ఎన్నికను వచ్చే నెల 31లోపే నిర్వహించనున్నట్లు కూడా నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. శాసనసభ కార్యదర్శికి కూడా ఈ లేఖ ప్రతిని పంపించారు.