మున్సిపల్ ఫలితాలపై విచారణ వాయిదా
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల వాయిదాపై విచారణను హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది. ఫలితాల వెల్లడిపై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. ఏప్రిల్ 10లోగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని గతంలో న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇప్పుడు అదే న్యాయస్థానం గతంలో తానిచ్చిన ఆదేశాలను సవరించగలదా అని పిటిషన్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్ 10 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని గతంలో తామిచ్చిన ఆదేశాలను సవరించలేమని కోర్టు స్పష్టం చేసింది.
అయితే ఆర్టికల్ 32 ప్రకారం ఇచ్చిన తీర్పును పునసమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని, అదే నిబంధనల ప్రకారం హైకోర్టు కూడా చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మీ వైఖరి తెలపాలని ఎన్నికల కమిషన్ ను కోర్టు ప్రశ్నించింది.
దాంతో షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టులో తాము ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికల తేదీని రీ షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టును కోరామని తెలిపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు తీర్పు మున్సిపల్ ఫలితాలపై ప్రభావం చూపదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.