ఫలితాలు.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో నిర్వహించేందుకు సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుమతి ఇచ్చింది. అయితే వీటి ఫలితాలను మాత్రం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరవాతే వెల్లడించాలని ఆదేశించింది. జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం గురువారం ఉదయం ఈ కేసును విచారించింది. ఈ ఎన్నికలను ఏప్రిల్ 6, 8 తేదీల్లో నిర్వహించడానికి అనుమతివ్వాలంటూ కోర్టును ఎన్నికల సంఘం కోరడం తెలిసిందే. అరుుతే 8న శ్రీరామనవమి కావటంతో మర్నాడు నిర్వహించేందుకు వీలవుతుందా? అని న్యాయమూర్తులు బుధవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. గురువారం కేసు తిరిగి విచారణకు రాగా.. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, ఫలితాలు 13న విడుదల చేస్తామని ఎన్నికల సంఘంవిన్నవించింది.
జస్టిస్ గోపాలగౌడ స్పందిస్తూ ‘ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేదా?’ అని ప్రశ్నించారు. జస్టిస్ జ్ఞానసుధామిశ్రా జోక్యం చేసుకుని ‘ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు ఎప్పుడు?’ అని ప్రశ్నించారు. ఏప్రిల్ 30, మే 7వ తేదీల్లో ఉన్నాయని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మనోజ్ సక్సేనా చెప్పారు. స్థానిక ఎన్నికల జాప్యంపై సుప్రీంకోర్టులో కేసు వేసిన పిటిషనర్ ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఈ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయంటూ పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి విన్నవించడాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు... ‘స్థానిక ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున మే 7నసార్వత్రిక ఎన్నికలు ముగిశాకే ఈ ఫలితాలు ప్రకటించాలి. అలాగే ఎన్నికల సంఘం తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ చేసిన ప్రతిపాదన మేరకు ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు..’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా సాధారణ ఎన్నికల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే.. అవి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అవి తమకు ఇబ్బందికరంగా మారవచ్చని భయుపడిన పలు పార్టీలు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.
ఎప్పుడు ఎక్కడ నిర్వహించేదీ నేడు వెల్లడి: సుప్రీం తీర్పు నేపథ్యంలో జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను తయారు చేసింది. జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ఆధారంగా ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఒక జిల్లాలో నాలుగు డివిజన్లుంటే.. రెండు డివిజన్లకు 6న, మరో రెండు డివిజన్లకు 11న ఎన్నికలు నిర్వహిస్తారు. మూడు డివిజన్లుంటే.. 2 డివిజన్లకు ఒకరోజు, ఒక డివి జన్‌కు రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వర్గాలు తెలియజేశాయి. ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేదీ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఎన్నికల ఫలితాలను మే 9-15 తేదీల మధ్యలో ప్రకటించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఫలితాలు ఆలస్యం కానున్న నేపథ్యంలో మండల, జెడ్పీ చైర్‌పర్సన్‌ల ఎన్నిక షెడ్యూల్ కూడా మారనుంది.