సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి జనరల్ సైన్స్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏప్రిల్ 7న పదో తరగతి సైన్స్ మొదటి పేపర్, 9న సైన్స్ రెండో పేపర్ పరీక్షలున్నాయి. అన్ని కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగి, రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాకుంటే.. పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి, రెండో విడతల్లో ఏవైనా గొడవలు జరిగి పోలింగ్‌కు అంతరాయం ఏర్పడితే, మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలలనే పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్నందున.. రెండింటినీ ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని వివిధ జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాఠశాల విద్యా కమిషనర్‌తో ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడారు. పరీక్షల వాయిదా వల్ల ఇబ్బందులు ఉంటాయని, రీపోలింగ్ అవసరమైన ప్రాంతాల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారుల విజ్ఞప్తికి ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి జిల్లాల అధికారులతో చర్చిస్తామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఇబ్బందులు ఉండవని సమాచారం వస్తే సైన్స్ పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం ఉండదని ఎన్నికల సంఘం చెప్పినట్లు తెలిసింది. లేని పక్షంలో సైన్స్ పేపర్లు రెండూ వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వచ్చే వారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పరీక్షలు వాయిదా వేస్తే.. ఏప్రిల్ 13, 14 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
టెన్త్ సైన్స్ పరీక్షలకు ‘స్థానిక’ అడ్డంకి
Published Mon, Mar 17 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement