
చేతులెత్తేశారు !
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులెత్తేశారు. జిల్లాలోని అన్ని స్థానాల నుంచి కనీసం అభ్యర్థులనూ నిలబెట్టలేకపోయారు.
- ‘స్థానికం’లో తేలిపోయిన కాంగ్రెస్
- 33 జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నిల్
- 685 ఎంపీటీసీల్లో నామినేషన్లు లేవు
- వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే పోటీ
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులెత్తేశారు. జిల్లాలోని అన్ని స్థానాల నుంచి కనీసం అభ్యర్థులనూ నిలబెట్టలేకపోయారు. జిల్లాలోని 33 మండలాల నుంచి జెడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ రాలేదు. 901 ఎంపీటీసీ స్థానాలకు గాను 685 సెగ్మెంట్లలో అభ్యర్థులు కరువయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది.
అభ్యర్థులేరీ?
జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి మెజారిటీ స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీకి చావుదెబ్బతగిలింది. చిత్తూరు డివిజన్ పరిధిలో యాదమరి, బంగారుపాళ్యం, కార్వేటినగరం, గుడిపాల, రామచంద్రాపురం, పాలసముద్రం, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థులు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు.
తిరుపతి డివిజన్‌లోపిచ్చాటూరు, పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, పులిచెర్ల, సత్యవేడు, బీఎన్.కండ్రిగ మండలాల నుంచి నామినేషన్లు పడలేదు. మదనపల్లె డివిజన్‌లో గంగవరం, చౌడేపల్లె, గుర్రంకొండ, చిన్నగొట్టిగల్లు, కలికిరి, కురబలకోట, వాల్మీకిపురం, పీటీఎం, పలమనేరు, రొంపిచెర్ల, సోమల, మదనపల్లె రూరల్, నిమ్మనపల్లె, రామసముద్రం, పీలేరు, కేవీ పల్లె జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ నుంచి ఆ పార్టీ తప్పుకుంది.
ఎంపీటీసీల్లో ఘోరం
ఎంపీటీసీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా అభ్యర్థులు మొహం చాటేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 901 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 216 చోట్ల మాత్రమే కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి.