నేటి నుంచి విజయమ్మ జనపథం | vijayamma janapatham from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి విజయమ్మ జనపథం

Published Thu, Mar 20 2014 12:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నేటి నుంచి విజయమ్మ జనపథం - Sakshi

నేటి నుంచి విజయమ్మ జనపథం

 జిల్లాలో నాలుగు రోజుల పర్యటన
 పలుచోట్ల రోడ్‌షోలు, బహిరంగ సభలు
 సంక్షేమ ఎజెండాతో జనంలోకి
 స్థానిక సమరానికి వైఎస్సార్‌సీపీ సన్నద్ధం
 మునిసిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

 సాక్షి ప్రతినిధి, కర్నూలు రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. ‘జనపథం’ పేరుతో చేపట్టిన ఈ యాత్ర జిల్లాలో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.
 
 ఈ సందర్భంగా పలుచోట్ల రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు  పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న మున్సిపల్, స్థానిక ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది.
 
 అభ్యర్థుల ఎంపికను పకడ్బందీగా చేపట్టింది. అయితే వైఎస్సార్సీపీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కంకణం కట్టుకున్నాయి. కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. గతం లో జరిగిన పంచాయతీ, సహకార ఎన్నికల్లోనూ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడినా ఓటర్లు వాటిని తిప్పికొట్టారు. తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నామని స్పష్టం చేశారు.
 
 వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం..
 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాకు వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. విజయమ్మ ప్రచారంతో మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీసీ గెలుపు నల్లేరు మీద నడకేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
 గురువారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా నుంచి నేరుగా కొలిమిగుండ్లకు చేరుకుని విజయమ్మ రోడ్‌షో నిర్వహిస్తారు. అక్కడి నుంచి అవుకు మీదుగా బనగానపల్లెకు చేరుకుని రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి అక్కడే బసచేస్తారు. 21 వ తేదీ ఉదయం కోవెలకుంట్లకు చేరుకుని రోడ్‌షో నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఆళ్లగడ్డకు చేరుకుంటారు.
 
 అక్కడ రోడ్‌షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం నంద్యాల చేరుకుని రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొని మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తారు. శుక్రవారం రాత్రి నంద్యాలలో బసచేసి శనివారం ఉదయం బండిఆత్మకూరు, వెలుగోడు మీదుగా ఆత్మకూరు చేరుకుంటారు. రోడ్‌షోలో పాల్గొని బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పాములపాడు మీదుగా నందికొట్కూరు చేరుకుంటారు.
 
  అక్కడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం డోన్‌కు చేరుకుని ఆ రాత్రి అక్కడే బసచేస్తారు. మరుసటి రోజు ఆదివారం ఉదయం డోన్‌లో రోడ్‌షో, బహిరంగసభలో ప్రసంగిస్తారు.
 
  అక్కడి నుంచి నేరుగా గూడూరుకు చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఎమ్మిగనూరు, ఆదోని మునిసిపాలిటీల్లో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని మహబూబ్‌నగర్ జిల్లాకు బయలుదేరి వెళతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement