'చంద్రబాబు పాలన తలచుకుంటే భయమేస్తుంది'
కర్నూలు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ గడ్డి అయినా తినడానికి సిద్ధపడతారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అధికారం కోసం, పదవుల కోసం ఆయన ఎంత నీచానికైనా ఒడిగడితారని జగన్ మండిపడ్డారు. జిల్లాలోని పత్తికొండ ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన ఆయనకు ప్రజల బ్రహ్మరథం పట్టారు. అక్కడకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన జగన్.. ప్రజలకు ఏదో చేశామని పేపర్లో రాయించుకున్నఘనడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. ఆనాటి బాబు హయాంలో అర్హులకు పింఛన్లు అందలేని పరిస్థితిని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు.
రూ.2కిలో బియ్యాన్ని రూ.5.25పైసలు పెంచడమే కాకుండా, ప్రతి గ్రామంలో బెల్ట్‌షాపులు తీసుకొచ్చిన వ్యక్తి బాబేనని జగన్ తెలిపారు. చంద్రబాబు పాలన తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందన్నారు. తమ పిల్లల చదువులు కోసం ఆస్తులు అమ్ముకున్న రోజులను ఆయన పాలనలో చూశామని, ఇప్పుడు మళ్లీ అధికారం ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నికల ముసుగేసుకొస్తున్నారని జగన్ తెలిపారు. వచ్చే 25 రోజుల్లోపే మన తలరాతలు మార్చే ఎన్నికలొస్తున్నాయని, ఏ నాయకుడైతే ప్రజల మనసెరుగుతాడో వారికి పట్టం కట్టాలన్నారు. ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తిని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు పని చేశారని, కానీ ముఖ్యమంత్రి ఇలాగే ఉండాలని మహానేత వైఎస్సార్ పాలనలో చూశామన్నారు. మళ్లీ తిరిగి వైఎస్సార్ సువర్ణయుగాన్ని తెచ్చుకోవడానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.