చెట్టును చూపి కాయలమ్ముకునే చంద్రబాబు: విజయమ్మ
కడప: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెట్టును చూపి కాయలమ్ముకొనే వ్యక్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో వైఎస్ఆర్సిపి జనపథం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు 9 ఏళ్ల పరిపానలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఓట్లు, సీట్లు కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్టే లక్షా 30వేల రూపాయలని, రైతుల రుణాలు లక్షా 27వేల కోట్లు ఉంటే ఎలా మాఫీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఆయన అవినీతిపరుడు కాబట్టే ఉద్యోగస్థులందని అవినీతిపరులన్నారన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్నారు. ఆయన నిక్కర్లేసుకున్నప్పుడే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉంది. బీసీలను నిర్వీర్యం చేసిన వ్యక్తి. వందలాది మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారకుడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీని తెలుగుకాంగ్రెస్గా మార్చారన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే సత్తా జగన్కే ఉందని విజయమ్మ చెప్పారు. కౌన్సిలర్లు గెలిస్తే ఎమ్మెల్యేలు గెలిచినట్లేనని, ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్ గెలిచనట్లేనని, జగన్ గెలిస్తే వైఎస్ఆర్ సీపీ గెలిచినట్లేనని ఆమె అన్నారు. 30 సంవత్సరాలపాటు వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. బంగారు ఆంధ్రప్రదేశ్గా ఉంచాలన్న వైఎస్ఆర్ కలను జగన్ నిజం చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడే నాయకులను ఎన్నుకొనే అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రజలపై ఒక్క పైసా పన్ను భారం పడకుండా పరిపాలన వైఎస్ఆర్ వల్లే సాధ్యమైందన్నారు.
లక్షా 20వేల మంది మహిళలకు అభయహస్తం పథకం వైఎస్ఆర్ అందించారని గుర్తు చేశారు. మహిళలకు పావలావడ్డీ రుణాలను తీసుకొచ్చిన ఘనత ఆయనదేన్నారు. సామాన్యప్రజలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదేనని చెప్పారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం జలయజ్ఞాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.