మహిళలకు వైఎస్ఆర్సీపీ పెద్దపీట
నిన్నమొన్నటి వరకు వంటిళ్లకే పరిమితమైన మహిళలు... ప్రస్తుతం రాజకీయాల్లో సత్తా చాటటానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికల కదనరంగంలో కాలుదువ్వుతూ పురుషులకు సవాలు విసురుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసింది.
విశాఖ జిల్లాలో కూడా కీలక రెండు ఎంపీ స్థానాలకు మహిళలకే కేటాయించి మహిళల ఆదరాభిమానాలను చూరగొంటోంది. ఈ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ సీటును మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే. కీలకమైన విశాఖ ఎంపీ స్థానం నుంచి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పోటీ చేస్తున్నారు. అలాగే అరకు లోక్సభ స్థానాన్ని కొత్తపల్లి గీతకు కేటాయించగా, పాడేరు నియోజకవర్గం అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇచ్చారు.
మరోవైపు జిల్లాలో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. మహిళా హక్కులు, రిజర్వేషన్లు విషయంలో ప్రగల్భాలు పలికే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటివరకూ నామమాత్రంగానే సీట్లను కేటాయిస్తున్నారు. ఇస్తున్న ఒకటి, రెండు సీట్లు అప్రధానమైన, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి బలంగా ఉన్న స్థానాలను అంటగడుతున్నాయి. ఈసారి టీడీపీ తరపున పాయకరావుపేట నుంచి వంగలపూడి అనితకు మాత్రమే అవకాశం దక్కింది. కాంగ్రెస్ నుంచి నలుగురికి అవకాశం కల్పించిన అప్రాధాన్య సీట్లను కేటాయించింది.