టౌన్ ప్లానింగ్‌లో అవినీతి అంతస్తులు
Published Mon, Nov 25 2013 2:56 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
పాలకొండ, న్యూస్‌లైన్: నగర పంచాయతీగా మారిన స్వల్పకాలంలోనే పాలకొండ మున్సిపాలిటీ అక్రమాల కొండలా తయారైంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్‌లో అవినీతి మిగిలిన మున్సిపాలిటీలను తలదన్నుతోంది. పట్టణం మున్సిపాలిటీ స్థాయికి ఎదగడంతో నివాస, వాణిజ్య భవన నిర్మాణాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఇదే అదనుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముడుపులు దండుకొని ఎడాపెడా అనుమతులు మంజూరు చేసేస్తున్నారు. ఒక ఇంటి ప్లాన్ ఆమోదానికి నగర పంచాయతీ కమిషనర్ లంచం తీసుకుంటూ నాలుగు రోజుల క్రితం ఏసీబీకి దొరికిపోయిన అనంతరం టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నగర పంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత సాధారణ నివాస గృహాలతోపాటు సామూహిక గృహాలు, వాణిజ్య భవనాలు, కల్యాణ మండపాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతి కోరుతూ ఇప్పటివరకు నగర పంచాయతీకి 63 దరఖాస్తులు అందాయి. ప్లాన్ ఆమోదం కోసం దరఖాస్తుదారుల దగ్గర నుంచి రూ.30 లక్షల వరకు టౌన్‌ప్లానింగ్ విభాగం దండుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. కమిషనర్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి తాను టౌన్ ప్లానింగ్ విభాగానికి సైతం భారీగానే ముడుపులు చెల్లించుకున్నట్టు చెప్పినట్లు తెలుస్తోంది.
దీనికితోడు మంజూరు చేసిన ప్లాన్ అనుమతులు కూడా వివాదాస్పదంగా కనిపించడంతో జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి సురేష్ నేతృత్వంలో ఒక బృందం శాఖాపరమైన విచారణ జరిపింది. గత మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిన ఈ బృందం పలు నిర్మాణాలకు అనుమతులు కోరుతూ నగర పంచాయతీకి సమర్పించిన ప్లాన్లకు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఎటువంటి పొంతన లేని విషయాన్ని గుర్తించారు. ఇదే విషయమై సదరు భవనాల యజమానులను ప్రశ్నించగా ఉల్లంఘనలు వాస్తవమేనని అం గీకరిస్తూ, దాని కోసమే ముడుపులు చెల్లించినట్లు బృందానికి వెల్లడించారు. దాంతో నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఇంటి ప్లాన్లను రాష్ట్ర అధికారులకు పంపినట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. నగర పంచాయతీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలోని రికార్డులను సైతం విచారణాధికారులు స్వాధీనం చేసుకొని తమతో తీసుకెళ్లారు. స్థానికంగా వీటిపై విచారణ జరిగితే ఒత్తిళ్లు పెరుగుతాయన్న భావనతోనే వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
బహిర్గతమవుతున్న భాగోతాలు...
ఇంటి ప్లాన్ల విషయంలో మరిన్ని భాగోతాలు బహిర్గతమవుతున్నాయి. వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్న యజమానులు నగర పంచాయతీ ఆదాయాన్ని ఎగ్గొంటేందుకు తప్పుడు ప్లాన్లు రూపొందించి, అధికారులకు కొంత ముట్టజెప్పి ఆమోద ముద్ర వేయించుకుంటున్నారు. దండిగా ముడుపులు ముడుతుండటంతో ఎవరు చూస్తారులే అన్న ధీమాతో యజమానులు కోరిన విధంగా ప్లాన్లను అధికారులు ఆమోదిస్తున్నారు. మరికొందరు పలుకుబడి ఉన్నవారు తమనెవరు పట్టించుకుంటారులే అన్న నిర్లక్ష్య వైఖరితో కనీసం అనుమతి కోరుతూ దరఖాస్తు కూడా చేయడం లేదు.
Advertisement