- నందిగామ జిల్లా న్యాయమూర్తి గూడూరు రామకృష్ణ
జగ్గయ్యపేట అర్బన్ : దీర్ఘకాలంగా కోర్టుల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని 16వ అదనపు కోర్టు నందిగామ జిల్లా న్యాయమూర్తి గూడూరు రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్త వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ తదితర అంశాలపై శుక్రవారం రాత్రి సెమినార్ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ కళాశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన చేయాలని, బోధన పట్లే కాకుండా ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ చేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ముఖ్యంగా మహిళలు ఇటువంటి వారి పట్ల చాలాజాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోక్‌అదాలత్‌లో న్యాయశాస్త్ర కోవిదులు, అధికార, అనధికార ప్రముఖుల సమక్షంలో స్నేహపూర్వక వాతావరణంలో ఉభయపక్షాలకు ఆమోదయోగ్యమైన తీర్పుద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. చిన్న చిన్న వివాదాల్లో కోర్టులకు వెళ్లకుండా పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవన్నారు.
తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. విద్యార్థినీలు కుంగ్‌ఫూ, కరాటేలు నేర్చుకోవాలన్నారు. జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు, సెకండ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ వెన్నబోయిన నరసింహారావు, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, వత్సవాయి, జగ్గయ్యపేట, చిల్లకల్లు ఎస్‌ఐలు షణ్ముఖసాయి, నాగరాజు, చార్టెడ్ అకౌంటెంట్ పెనుగొండ బదిరినారాయణ పాల్గొన్నారు.