38 సవరణలకు లోక్‌సభ ఓకే !
* కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరణలే అటూఇటూ మార్పు
* ప్రధాన డిమాండ్లకు తావేలేని టీ బిల్లు
* హైదరాబాద్ యూటీ, ఆదాయంలో వాటా, సీమాంధ్రకు నిర్దిష్ట ఆర్థిక ప్యాకేజీ ముచ్చటే లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ 38 సవరణలు చేసింది. జీవోఎం సూచనల మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన కొన్ని సవరణలనే కొద్దిగా అటూఇటూ మార్చారు. ప్రతిపక్షం, ప్రధాన పార్టీలు డిమాండ్ చేసిన కీలక సవరణలేవీ చోటుచేసుకోలేదు.ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం, హైదరాబాద్ ఆదాయంలో వాటా, సీమాంధ్రకు నిర్దిష్టమైన ఆర్థిక ప్యాకేజీ, పన్ను విరామం, రాజధాని నిర్మాణానికి ఆర్థికసాయం వంటి ప్రధాన డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదు. ముసాయిదాలో, ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లులోని కొన్ని అంశాల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లు, భాషా దోషాలు, అంకెల్లో తేడాలను సవరించటానికే పరిమితమయ్యారు. లోక్‌సభ ఆమోదించిన సవరణల్లోని ముఖ్యమైనవి ఇవీ..
పోలవరం ముంపునకు గురయ్యే 134 రెవెన్యూ గ్రామాలతోపాటు (సాగునీటి శాఖ 2005 జూన్ 27న జారీ చేసిన జీవో 111 ప్రకారం శివార్లతో కలిపి 204 గ్రామాలు) బూర్గంపహాడ్ మండలంలోని బూర్గంపాడు, సీతారామనగరం, కొండెర్క గ్రామాలను ఖమ్మం నుంచి మినహాయించి సీమాంధ్రలో కలిపారు. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి ప్రత్యామ్నాయాల పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీ నివేదిక అందించే కాలపరిమితిని 45 రోజుల నుంచి 6 నెలలకు పెంచారు. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశానికి ముందే తెలంగాణ సభ్యుల పదవీ కాలం ముగుస్తుందన్న బిల్లులోని క్లాజు 17(4) తొలగింపు. రెండు రాష్ట్రాల శాసనసభలకు ఒక్కరు చొప్పున ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్ నామినేట్ చేస్తారు. దీనిని క్లాజు 17(ఎ) కింద చేర్చారు.
ప్రస్తుత స్పీకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్‌గా కొనసాగుతారు. తెలంగాణ ఏర్పాటు కాగానే డిప్యూటీ స్పీకర్ కొత్త రాష్ట్రానికి స్పీకర్‌గా వ్యవహరిస్తారు (కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు) తెలంగాణ అసెంబ్లీ ఏర్పడి కొత్త నిబంధనలు ఏర్పాటు చేసుకునే వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనలే అమలులో ఉంటాయి. విభజన జరిగిన వెంటనే రెండు మండళ్లు ఏర్పాటవుతాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 50, తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుత శాసన మండలి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలికీ కొనసాగుతారు. డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.
తెలంగాణ శాసనమండలికి చైర్మన్ ఎన్నికయ్యేవరకు ప్రస్తుత డిప్యూటీచైర్మన్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మండలికి సంబంధించి సభా వ్యవహారాల నిబంధనల్లో మార్పుచేర్పులు చేసేవరకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. ఇందులో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 ఉంటాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. వీటిలో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు ఉంటాయి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు 175 అసెంబ్లీ స్థానాలు ఉంటారుు. వీటిలో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 స్థానాలు ఉంటాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు కాగా 19 ఎస్సీ, 12 ఎస్టీ స్థానాలు ఉంటాయి. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా నిధులు కేటాయింపునకు 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్రపతి సూచిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక సహాయాన్ని కేంద్రం పరిశీలిస్తుంది.
కొత్త రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేటాయింపు విషయంలో ఆప్షన్లు స్వీకరిస్తారు. రెండు రాష్ట్రాల మధ్య ఏవైన వివాదాలు వస్తే కేంద్ర నిర్ణయమే అంతిమం. తెలంగాణకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు. కొత్త కమిషన్ ఏర్పాటయ్యే వరకు రాష్ట్రపతి అనుమతితో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధులు నిర్వహిస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చినట్లుగానే పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును చేపట్టి దానికి అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులతోపాటు పునర్నిర్మాణ, పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక, మౌలిక సదుపాయూల కల్పనకు పదేళ్లపాటు కేంద్రం సాయం అందిస్తుంది.
అక్షర క్రమంలో తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉంటుంది. ఇదివరకు 29వ రాష్ట్రంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల జాబితాలో మొదటి బిల్లులో మరిచిపోయిన బచ్చల పుల్లయ్య పేరును తాజాగా చేర్చారు. గిరిజన తెగల పేర్లకు సంబంధించి దొర్లిన పొరపాట్ల సవరణ నిధుల జాబితాలో మొదటి బిల్లులో 41 ఉండగా... ఆ సంఖ్యను తాజాగా 69 చేశారు. కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో మొదటి బిల్లులో 44 ఉంటే.. వాటి జాబితా తాజాగా 89కి పెరిగింది. రాష్ట్రస్థాయి సంస్థలు 42 ఉన్నట్లు మొదట పేర్కొనగా తాజాగా 101కి పెరిగాయి. కృష్ణా బేసిన్‌పై నిర్మిస్తున్న హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు-నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని అలాగే కొనసాగించవచ్చు. పాత పద్దతి ప్రకారమే నీటి పంపకాలు కొనసాగుతాయి.
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాల్లో క్రమ సంఖ్యలు, రిజర్వేషన్లు వాటి పరిధిలోకి వచ్చే స్థానాల పేర్లలో దొర్లిన పొరపాట్లను సరిదిద్దుతూ కొత్త జాబితా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పెట్రోలియం యూనివ ర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంటు, వైఎస్సార్ జిల్లాలో ఒక స్టీల్ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని బిల్లులో చేర్చారు. వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఏపీలో రిఫైనరీ, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టుల అభివృద్ధి విషయంలోనూ ఆరు నెలల కాలపరిమితి విధించారు. విశాఖపట్నం, విజయవాడ- గుంటూరు- తెనాలి మధ్య మెట్రో రైళ్ల సదుపాయం కల్పన విషయంలో ఒక సంవత్సరం కాలపరిమితి విధించారు.