దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీకాళహస్తి శివయ్యను కోరుకున్నట్లు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు.
♦ రాహుకేతు పూజల్లో లోకసభ స్పీకర్
♦ కళంకారీ వస్త్రాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్
శ్రీకాళహస్తి : దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీకాళహస్తి శివయ్యను కోరుకున్నట్లు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. శుక్రవారం ఆమె బంధువులతో కలసి శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. ఏఈవో శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు పూర్ణకుంభంతో ప్రత్యేక స్వాగతం పలికారు. రూ.2500 టికెట్ ద్వారా రాహుకేతు సర్పదోషనివారణ పూజలు చేయించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నా రు. అర్చన చేయించుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు.
ఆలయాధికారులు దుశ్శాలువతో సత్కరించారు. స్వామి, అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలోని సుపథమండపం వద్ద విలేకరులతో ఆమె మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధిలో గుర్తింపు పొందాలని శ్రీకాళహస్తి శివయ్యను కోరుకున్నట్లు తెలిపారు. రాహుకేతుసర్పదోష నివారణ పూజల మహిమలు తెలుసుకుని చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయ పురాతనమైన కట్టడాలు, శిల్పసౌందర్యం అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
సుపథమండపం వద్ద భానోదయ కళంకారీ సెంటర్ నిర్వాహకులు కళంకారీ వస్త్రాలను తీసుకొచ్చి చూపించారు. దేశంలోనే కళంకారీలో శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉందని, పలువురు పద్మశ్రీ అవార్డులు కూడా పొందారని ఆమెకు వివరించారు. కళంకారీ వస్త్రాల తయారీ, వాటి ప్రాముఖ్యం, మార్కెట్‌లో వాటి ధరలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కళంకారీ వస్త్రాలను ఆమె కొనుగోలు చేశారు. ఆమెతోపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కండ్రిగ ఉమ, నాయకులు కోలా ఆనంద్, వయ్యాల మనోహర్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు ఉన్నారు.