వెలుగు చూస్తున్న వాస్తవాలు | Looking for the light of the facts | Sakshi
Sakshi News home page

వెలుగు చూస్తున్న వాస్తవాలు

Published Mon, Jun 2 2014 1:47 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వెలుగు చూస్తున్న వాస్తవాలు - Sakshi

వెలుగు చూస్తున్న వాస్తవాలు

రంపచోడవరం, న్యూస్‌లైన్ : గిరిజన రైతుల అమాయకత్వాని ఆసరాగా చేసుకుని బ్యాంకు సిబ్బంది, దళారులు వ్యవసాయ రుణాల పేరిట లక్షలాది రూపాయలు నొక్కేశారు. అడ్డతీగలలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ అక్రమాలకు అడ్డాగా మారింది. 2010-12 మధ్య కాలంలో ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఐఓబీ రీజనల్ ఆఫీసర్ జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలు వాస్తవాలు వెలుగు చూశాయి. రూ. 13.70 లక్షల మేరకు రుణాల పేరిట నిధులు పక్కదారి పట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అడ్డతీగల పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 24న అప్పటి బ్యాంకు మేనేజర్ భాస్కరాచారి సహా మరో 19 మంది ( సిబ్బందితో పాటు దళారులు) పై కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం రంపచోడవరం ఏఎస్పీ విజయారావు విచారణ నిర్వహిస్తున్నారు. బ్యాంకు అధికారులతో ఒప్పందానికి వచ్చిన దళారులు రైతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని రుణాలు ఇప్పిస్తామని పాసు పుస్తకాలు తెచ్చి బ్యాంకులో కుదువ పెట్టారు. రూ. 50 వేలు రుణం తీసుకుంటే రైతుకు రూ. 20 వేలు ఇచ్చి, మిగిలిన సొమ్మంతా బ్యాంకు సిబ్బంది, దళారులు దిగమింగినట్టు విచారణలో రుజువైంది.
 
 రుణాలు పొందిన రైతుల పేరిట రికవరీ లేకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వాటిని అందుకున్న రైతులు నమోదైన అసలు రుణాలను చూసి కంగుతిన్నారు. అడ్డతీగల, వై.రామవరం మండలాల్లో ఈ విధంగా ఎక్కువ మొత్తాలు చేతులు మారినట్టు స్పష్టమైంది. నేరుగా దళారులు నకిలీ పాసు పుస్తకాలను తయారు చేసి బ్యాంకులో కుదువపెట్టి సుమారు రూ. కోటి వరకు జేబులో వేసుకున్నట్టు తెలుస్తోంది. మొల్లేరు ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత ఒక్కరే రూ.5 లక్షలు రుణాల పేరిట నొక్కేసినట్టు చెబుతున్నారు. ఆ ఒక్క ప్రాంతంలోనే 32 మంది నకిలీ పాసు పుస్తకాలు బ్యాంకులో ఉంచినట్టు తెలుస్తోంది.
 
 తవ్విన కొద్దీ అక్రమాల చిట్టా బయటపడుతుండడంతో రూ. కోట్లలోనే రుణాలు పక్కదారి పట్టినట్టు ఓ నిర్ణయానికి వచ్చిన పోలీసు అధికారులు ఆయా ప్రాంతాల్లోని ఆదర్శరైతులు, కొందరు దళారులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల ద్వారా మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారంలో వేటమామిడికి చెందిన ఓ ఉపాధ్యాయుడు దళారీగా మారి కీలకపాత్ర పోషించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రుణాల కోసం జామీను సంతకాలు పెట్టిన వారితో పాటు  దళారులుగా వ్యవహరించిన వారిని కూడా విచారిస్తున్నారు.
 
 అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం : ఏఎస్పీ విజయారావు
 గంగవరం, న్యూస్‌లైన్ : అడ్డతీగల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్నట్టు  రంపచోడవరం ఏఎస్పీ విజయరావు తెలిపారు. విచారణలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన గంగవరం పోలీస్ స్టేషన్‌కు సందర్శించారు. స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అడ్డతీగల ఐఓబీ నుంచి 16 మంది నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్టు బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.
 
రుణాల రికవరీ లక్ష్యంగా కాకుండా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతుందన్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టగా కొన్ని చిరునామాలు తెలియడం లేదని, వారి బ్యాంకు అకౌంట్  ప్రారంభం కోసం సంతకం చేసిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. విలేకర్ల సమావేశంలో అడ్డతీగల సీఐ హనుమంతరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement