ఉత్సాహంగా ఐక్య క్రిస్మస్
Published Fri, Dec 20 2013 3:33 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
=కుంభా రవిబాబు ఆధ్వర్యంలో గద్యగుడలో నిర్వహణ
=పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ చొక్కాకుల
అరకులోయ, న్యూస్‌లైన్: మతం కన్నా మానవత్వం గొప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కుంభా రవిబాబు చెప్పారు. మానవత్వాన్ని ప్రబోధించిన క్రైస్తవ మతానికి అందుకే విశేష ఆదరణ లభించిందని తెలిపారు. మండలంలోని గద్యగుడ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. క్రైస్తవం మానవాళికి మంచి జీవన విధానాన్ని బోధించే మార్గమని తెలిపారు.
మన్యంలో క్రైస్తవ మతం అభివృద్ధి చెందడం వల్ల చెడు వ్యసనాల నుంచి అనేక మంది బయట పడి తమ జీవితాలను చక్కదిద్దు కున్నారని ఆయన తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన్యవాసులకు దైవ సందేశాన్ని వినిపిస్తున్న మత బోధకులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావుకు, దైవ సేవకులకు తినిపించారు. సభలో చొక్కాకుల ప్రసంగిస్తూ క్రైస్తవులంతా ఒకే వేదికపైకి వచ్చి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు.
ఏటా రవిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందాయకమని చెప్పారు. పాస్టర్స్ ఫొలోషిఫ్ అధ్యక్షుడు జాన్ ప్రకాష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన మత బోధకుడు ప్రసంగికుడు స్టీవెన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన, రెవరెండ్ సంజీవ్ కుమార్, కొర్రా శెట్టి బాబురావు దైవ సందేశాన్ని అందించారు.
ఎస్.కోట వైఎస్సార్ కాంగ్రెస్ నేత రాంనాయుడు, డాక్టర్ అజయ్, ఏయూ ప్రొఫెసర్‌లు అప్పారావు, అరుణ్ కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బి.బి జగ్గన్న, పాంగి చిన్నారావు, పల్టాసింగ్ విజయ్ కుమార్, పొద్దు అమ్మన్న, కొండలరావు, సొన్నాయి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్ మండలాల నుంచి పాస్టర్లు, క్రైస్తవులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement