సాక్షి, గన్నవరం : ఆంధ్రప్రదేశ్‌కు సంజీవనిగా భావిస్తున్న ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి వాటిని ఆమోదింప చేయించడం అభినందనీయమని ఆ పార్టీ సీనియర్ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు అన్నారు. ఆదివారం గన్నవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. 5 కోట్ల ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు తమ పదవులు తృణప్రాయంగా వదులుకున్న ఐదుగురు ఎంపీలు నిజమైన నాయకులని కొనియాడారు.
టీడీపీ ఎంపీలకు హోదా సాధనపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై తాము పోరాటం చేయడం లేదనడం టీడీపీ నేతల అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి వాటిని ఆమోదింపచేసుకోవడం టీడీపీ నేతలకు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్న ముగ్గురు ఎంపీలు గురించి టీడీపీ నేతలు ఏమని బదులిస్తారంటూ నిలదీశారు.
వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుటు దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వైఫల్యం కారణంగా పవిత్ర సంగమం వద్ద నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు జరగకుండా తక్షణమే హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అదే ప్రదేశంలో బోటు ప్రమాదం జరిగి 22 మంది మృతి చెందినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. నీటిలో మునిగి గల్లంతైన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment