Dutta Ramachandra Rao
-
వైఎస్సార్సీపీ సిద్ధాంతం కోసం దుట్టా పని చేస్తారు
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గంపై యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం, రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అప్రమత్తమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో వీళ్ల భేటీ జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వ్యక్తి దుట్టా రామచంద్రరావు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో దుట్టా ఒకరు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైతం దుట్టా కలిశారు. జగన్మోహన్ రెడ్డి కోసం.. పార్టీ సిద్దాంతం కోసం పనిచేసే వ్యక్తి దుట్టా అని బాలశౌరి తెలిపారు. ‘‘ఎంపీ బాలశౌరికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా సుదీర్ఘకాలం పనిచేసాం. మూడు నెలలు క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాను. ఆరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి నాఅభిప్రాయం చెప్పాను. నేడు ఎంపీ బాలశౌరికి అదే చెప్పాను అని దుట్టా మీడియాకు వివరించారు. మరికొందరు నేతలు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. -
దుట్టాకు వైఎస్సార్ ఫ్యామిలీ అరుదైన గిఫ్ట్
సాక్షి, హనుమాన్‌జంక్షన్: కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్‌కు చెందిన వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావును వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబం అరుదైన కానుకతో గౌరవించింది. 1976 నుంచి వైఎస్సార్‌తో దుట్టాకు ఉన్న సాన్నిహిత్యాన్ని మరోమారు గుర్తు చేసుకుంటూ మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ బహుమతిని పంపించారు. వైఎస్సార్ జ్ఞాపకంగా ఆయన ధరించిన దుస్తులను డాక్టర్ దుట్టాకు బహుమతిగా అందజేశారు. వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ప్రాణమిత్రుడు వేసుకున్న వస్త్రాలను తన చేతితో తడుముతూ దుట్టా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ ఉన్నంతకాలం తమ స్నేహానికి ఎంతో విలువ ఇచ్చారని, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబం తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తోందని దుట్టా గుర్తు చేసుకున్నారు. -
చింతమనేని ఇక నీ ఆటలు సాగవ్
పెదపాడు: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆటలు ఇక సాగవని, ఆయన పదవి ఊడటానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని దెందులూరు వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడులో దెందులూరు కార్యకర్తల సమావేశంలో అబ్బయ్య చౌదరీ మాట్లాడారు. మట్టి నుంచి ఇసుక వరకు అన్నింటిలోనూ చింతమనేని దోపిడీ పాల్పడ్డారని ఆరోపించారు. అప్పన ప్రసాద్‌పై అక్రమ కేసులు , రౌడీషీట్‌తో వేధించినా ఆయన భయపడలేదని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించమని అన్నారు. చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడానికి దెందులూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చింతమనేని రౌడీయిజంతో దెందులూరు ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని వివరించారు. చింతమనేని, వల్లభనేని ఇద్దరూ దోపిడీదారులే: దుట్టా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా దోపిడీదారులేనని వైఎస్సార్సీపీ నేత దుట్టా రామచంద్ర రావు విమర్శించారు. నియోజకవర్గాల్లో సెటిల్మెంట్లు, ఇసుక, మట్టి అక్రమాలే కనిపిస్తాయని చెప్పారు. గాంధీజీకి జాతిపిత బిరుదును నేనే ఇచ్చానని కూడా చంద్రబాబు చెప్పుకోగల ఘనుడని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు ఎక్కడ పేరొస్తోందనే భయంతోనే పోలవరం కాలువకు ఆనాడు దేవినేని ఉమ లాంటి వారు అడ్డుపడ్డారని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని కోరుతున్నట్లు తెలిపారు. లోకేష్ ఐటీ మంత్రి అయిన తర్వాత ఒక్క కంపెనీ రాలేదు: యార్లగడ్డ లోకేష్ లాంటి దిక్కుమాలిన ఐటీ మంత్రి వచ్చిన తర్వాత ఒక్క ఐటీ కంపెనీ కూడా ఏపీకి రాలేదని గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. లోకేష్ కాకుండా మరెవరైనా ఐటీ మంత్రి అయ్యింటే కనీసం ఒకటో, రెండో ఐటీ కంపెనీలు వచ్చేవని చెప్పారు. చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తుతోనే అధికారంలోకి వచ్చారని, కానీ వైఎస్ జగన్ ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ నుంచి ఐదుగురు ఎంపీలు రాజీనామా చేయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం చాలా దుర్మార్గమన్నారు. -
ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
సాక్షి, గన్నవరం : ఆంధ్రప్రదేశ్‌కు సంజీవనిగా భావిస్తున్న ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసి వాటిని ఆమోదింప చేయించడం అభినందనీయమని ఆ పార్టీ సీనియర్ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు అన్నారు. ఆదివారం గన్నవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. 5 కోట్ల ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు తమ పదవులు తృణప్రాయంగా వదులుకున్న ఐదుగురు ఎంపీలు నిజమైన నాయకులని కొనియాడారు. టీడీపీ ఎంపీలకు హోదా సాధనపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై తాము పోరాటం చేయడం లేదనడం టీడీపీ నేతల అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి వాటిని ఆమోదింపచేసుకోవడం టీడీపీ నేతలకు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్న ముగ్గురు ఎంపీలు గురించి టీడీపీ నేతలు ఏమని బదులిస్తారంటూ నిలదీశారు. వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుటు దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వైఫల్యం కారణంగా పవిత్ర సంగమం వద్ద నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు జరగకుండా తక్షణమే హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అదే ప్రదేశంలో బోటు ప్రమాదం జరిగి 22 మంది మృతి చెందినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. నీటిలో మునిగి గల్లంతైన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
వైఎస్సార్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ‘భారత రత్న’ బిరుదు ప్రదానం చేయాలని ఆయన సన్నిహితుడు, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. హనుమాన్‌జంక్షన్‌లోని ఆయన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అందించే భారతరత్న బిరుదుకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి అన్ని విధాలా అర్హుడని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ రంగం నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు కె.కామరాజ్, ఎం.జి.రామచంద్రన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం గోవింద్ వల్లభ్ పంత్, అస్సాం మాజీ సీఎం గోపీనాథ్బర్ధోలికు భారతరత్న ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇదే కోవలో ఎన్నో చారిత్రాత్మక పథకాలతో స్ఫూర్తిదాయక పాలన అందించిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి భారత రత్న బిరుదు ప్రదానం చేయాలన్నారు. పేద ప్రజల కోసం వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సీమెంట్, 108 అంబులెన్స్, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి పథాకాలు దేశానికి ఎంతో ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచాయని డాక్టర్ దుట్టా చెప్పారు. మండు వేసవిలో 1460 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేసిన తొలి నేత రాజశేఖరరెడ్డి అని చెప్పారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. 1978 నుంచి 2009 వరకు ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలుపొందిన ఏకైక నాయకుడుగా రికార్డు సృష్టించారని తెలిపారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా వరుస విజయాలు సాధించారని దుట్టా చెప్పారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టి ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. -
మహిళా ఎమ్మెల్యేను తిట్టించడం సిగ్గుచేటు
గన్నవరం: ఓ పక్క మహిళలు, బాలికలకు రక్షణగా నిలవాలి, గౌరవించాలి అని సీఎం చంద్రబాబు ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ.. మరోపక్క మహిళా ఎమ్మెల్యే అనే కనీస గౌరవం లేకుండా ఆర్కే రోజాను అసభ్యకరంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో తిట్టించడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గన్నవరం పార్టీ కార్యాలయంలో గురువారం విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, జోగి రమేశ్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న బుద్దా వెంకన్న సంస్కారహీనుడి వలే మాట్లాడుతుండటం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దాచేపల్లి ఘటనలో బాధితురాలి పక్షాన పోరాడిన రోజాను సభ్య సమాజం తలదించుకునే విధంగా బుద్దా మాట్లాడడం చూస్తుంటే టీడీపీకి మహిళలంటే ఏమాత్రం గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. ఇటువంటి బుద్ధిహీనులకు ప్రజలు తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ద్వారా డ్వాక్రా మహిళలు, రైతులు, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం వంటి సదుపాయాలన్నీ లభిస్తాయని అందరూ విశ్వసిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు: ఉదయభాను విపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సామినేని ఉదయభాను అన్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని వర్గాల ప్రజలు జగన్ దృష్టికి తీసుకువెళుతున్నారని, ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. రోజాను కించపరిచే విధంగా అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఓ సంస్కారహీనుడని జోగి రమేశ్ ధ్వజమెత్తారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించిన నీచ చరిత్ర ఉన్న బుద్దా గురించి జిల్లా ప్రజలందరికి తెలుసన్నారు. ప్రజలు ఛీకొట్టిన వారందరిని టీడీపీలోకి తీసుకువచ్చి ఎమ్మెల్సీ, విప్ పదవులిచ్చిన చరిత్రహీనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. మహిళ అనే కనీస గౌరవం లేకుండా వ్యవహరించిన బుద్ధిహీనుడైన బుద్దాను చెప్పులతో కొట్టినా తప్పులేదన్నారు. -
చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కల్యాణ్‌కు లేదు
హనుమాన్‌జంక్షన్ రూరల్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహాన్రెడ్డిని విమర్శించే స్థాయి లేదని, అలాగే సీఎం చంద్రబాబును ప్రశ్నించే దమ్ము కూడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు పేర్కొన్నారు. హనుమాన్‌జంక్షన్‌లో బుధవారం డాక్టర్ దుట్టా విలేకరులతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్, చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని మరోమారు పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష నేత నిత్యం ప్రజల్లో అవగాహన పెంచు తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుండటంతో మళ్లీ ప్రత్యేక ప్యాకేజీ కాదు హోదానే కావాలనే పల్లవిని చంద్రబాబు అండ్ కో అందుకుందని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్ జేఎఫ్సీ ఎందుకు ఏర్పాటైందో అర్ధం కావటం లేదన్నారు. పవన్‌కల్యాణ్ పూర్తిగా రాజకీయ అజ్ఞాని అని, చంద్రబాబు చేతిలో పూర్తిగా కీలుబొమ్మగా మారారని విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నించటం కోసం పుట్టిన జనసేన పార్టీ నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఆగడాలపై ప్రశ్నించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్ధంకావటం లేదన్నారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీ సభ్యుడు కొనకళ్ల వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శులు నక్కా గాంధి, దయాల విజయనాయుడు, జిల్లా అధికారప్రతినిధి వేగిరెడ్డి సూర్యనారా యణ, నాయకులు దుట్టా శివనారాయణ, అల్లంశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం సత్యనారాయణ పాల్గొన్నారు. -
బాబూ.. మభ్యపెట్టింది చాలు
హనుమాన్‌జంక్షన్ రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీపై మభ్యపెట్టడం మానుకుని రైతులను ఆదుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టరు దుట్టా రామచంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. రైతులు, డ్రాక్వా రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీపై కాలం గడుపుతున్నారని విమర్శించారు.ఎన్నికల సమయంలో రూ.1.05 లక్ష కోట్ల వ్యవసాయ రుణాలు రద్దుచేస్తానని చెప్పి నట్టేట ముంచారని చెప్పారు. రైతు సాధికార సంస్థ కార్యాలయం ప్రారంభించి మరోమారు రైతులను మభ్యపెట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటేకనీసం ముఖ్యమంత్రిగా అన్నమాట ప్రకారం ముందుగా 20శాతం రుణమాఫీకి మాత్రమే రూ.5వేల కోట్ల మూలనిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే ప్రకటించిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు, ఆరులైన్ల జాతీయ రహదారి తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఏడు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని వాటికి మార్కెట్ ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని సూచించారు. పార్టీలకతీతంగా పరిపాలన అందించాలి.. పార్టీల కతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని దుట్టా డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసి అర్హులైన వారివి, వైఎస్సార్ సీపీకి చెందిన వారిని పక్కన పెట్టడం దారుణమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ రుణాల లబ్ధిదారుల జాబితాను రద్దు చేయడం దుర్మార్గమయిన చర్య అని డాక్టర్ దుట్టా దుయ్యబట్టారు. -
రక్తసిక్తం
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఐదుగురి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు మృతుల్లో భార్యాభర్తలు, కుమారుడు శోకసంద్రంలో బంధువులు పుణ్యకార్యానికి వెళ్లివస్తుండగా దుర్ఘటన వేమండలో విషాదఛాయలు పుణ్యకార్యానికి వెళ్లివస్తున్న వారిపై మృత్యువు కరాళనృత్యం చేసింది. నలభై రోజుల కఠిన దీక్షచేసి దైవసన్నిధిలో విరమించిన అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రైస్తవ భక్తులపైకి మృత్యుశకటంలా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఐదుగురి ప్రాణాలు తీసింది. మరో ఆరుగురిని ఆస్పత్రిపాలు చేసింది. కుమారుడు సహా దంపతులు ఈ ఘటనలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. పామర్రు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఉంగుటూరు మండలం వేమండ గ్రామానికి చెందిన 14 మంది క్రైస్తవ భక్తులు ఏసు దీక్ష విరమణ కోసం శుక్రవారం రాత్రి బయల్దేరి మచిలీపట్నం వెళ్లారు. మంగినపూడి బీచ్‌లోని వేళంగిణీ మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున పూజలు, దీక్షా విరమణ కార్యక్రమాలు ముగించి సముద్రంలో స్నానాలు పూర్తిచేసి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. వారిలో ముగ్గురు తమ మోటార్ బైక్‌పై మచిలీపట్నం నుంచి గుడివాడ మీదుగా వేమండ చేరుకుంటామని అటుగా వెళ్లారు. మిగిలిన 11 మంది బందరు నుంచి పామర్రు మీదుగా వేమండ చేరే విధంగా ఆటోలో బయలుదేరారు. పామర్రులోని 14వ మైలురాయి వద్దకు ఆటో చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని గోగులమూడి సురేష్ (35), గోగులమూడి జ్యోతి (30), గోగులమూడి అఖిల్ (8), కొసనం సతీష్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మత్తే జోజిబాబు (35) ప్రాణాలొదిలాడు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు 108కి, పోలీసులకు సమాచారమిచ్చారు. తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన గుడిపూడి పార్వతి, మన్నెంపల్లి తేరేజమ్మ, బిరుదుగడ్డ అనిత, బిరుదుగడ్డ దానియేలు, తోకల ఆంటోనమ్మ, తోకల ఆనందరావులను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిన్నంటిన బంధువుల రోదనలు విషయం తెలుసుకున్న మృతుల బంధువులు వేమండ గ్రామం నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తమ వారి మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. బంధువులు రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. గుడివాడ డీఎస్పీ నాగన్న, పామర్రు సీఐ జి.శ్రీనివాస్‌యాదవ్, ఎస్ఐ విల్సన్‌బాబుతో కలిసి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుమారుడు సహా తల్లిదండ్రులు మృతి... ఈ ఘటనలో మృతిచెందిన గోగులమూడి సురేష్, జ్యోతి దంపతులు. చనిపోయిన అఖిల్ వారి కుమారుడు. వారికి మరో ఇద్దరు కుమార్తెలు హన్సిక, లక్కీ ఉన్నారు. తల్లిదండ్రులు, సోదరుడు ఒకేసారి మృతిచెందడంతో వారు అనాథలుగా మిగిలారు. గుంత వల్లే ప్రమాదం? ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాతీయరహదారిపై పెద్ద గుంత ఉంది. దానిని తప్పించే ప్రయత్నంలోనే ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. నేతల పరామర్శ... దుర్ఘటనపై సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద వివరాలు తెలుసుకుని బాధితులను పరామర్శించారు. గ్రామ సర్పంచి శనగవరపు సాంబశివరావు తదితరులు బాధిత కుటుంబాలను ఓదార్చారు. -
ప్రభంజనం
సాక్షి, గన్నవరం/ నూజివీడు : వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో జిల్లాలో జనభేరి రెండోరోజు కూడా ఉత్సాహంగా సాగింది.ఓ వైపు ఎండ తీవ్రత పెరుగుతున్నా ప్రజలు లెక్క చేయకుండా విజయమ్మను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో విజయమ్మ జనభేరి యాత్ర ఆద్యంతం అశేష జనహోరు నడుమ సాగింది. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి బయల్దేరి గన్నవరం చేరుకున్న విజయమ్మకు పార్టీ శ్రేణులు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో విమానాశ్రయం సెంటర్ వద్ద ఘనస్వాగతం పలికారు. భారీ ప్రదర్శనగా గన్నవరం చేరుకున్నారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో విజయమ్మ ప్రసంగించారు. ఆమె ప్రసంగం ఆద్యంతం అశేష జనవాహిని చప్పట్ల నడుమ సాగింది. చంద్రబాబు బూటకపు హామీలు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త వేషంతో వచ్చి చెప్పే కొత్త మాటలపై విజయమ్మ విమర్శలు గుప్పించగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రాజన్న రాజ్యం మళ్లీ తెచ్చుకోవటానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కె.పార్థసారథి, గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావు ప్రసంగించారు. ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ... పోరాటాల్లోంచి పుట్టి.. నిత్యం ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని విజయమ్మ తెలిపారు. గన్నవరం నుంచి తోటపల్లి, సింగన్నగూడెం మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ ఆగిరిపల్లి చేరుకున్న విజయమ్మ అక్కడ సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు, ఉద్యోగులకు ఏంచేశారని ఆమె ప్రశ్నించారు. గ్యాస్, విత్తనాలు, ఎరువుల ధరలు ఇలా అన్నీ పెంచారా లేదా అని ప్రజల్ని ప్రశ్నించినప్పుడు వారినుంచి విశేష స్పందన వచ్చింది. విలువలు, విశ్వసనీయత కోసం ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజయమ్మ కోరారు. అనంతరం అక్కడినుంచి నూగొండపల్లి, పిన్నమరెడ్డిపల్లి, ఎస్ఏ పేట, శోభనాపురం, ఈదర, కొత్త ఈదర, సీతారామపురం, యనమదల గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. అక్కడ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని ధర్మాజీగూడెం మండలానికి విజయమ్మ పయనమయ్యారు. వైఎస్సార్ జనభేరిలో పార్టీ ఎంపీ అభ్యర్థులు కె.పార్థసారథి (మచిలీపట్నం), డాక్టర్ తోట చంద్రశేఖర్ (ఏలూరు), ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు (గన్నవరం), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు) పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇద్దరు టీచర్లకు షోకాజ్ జి.కొండూరు, న్యూస్‌లైన్ : ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన ఇద్దరు టీచర్లకు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు స్థానిక తహశీల్దార్ మదనగోపాలరావు తెలిపారు. ఈ నెల 13న మైలవరంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుదర్శన్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిన వెలగలేరు జిల్లా పరిషత్‌కు చెందిన ఉపాధ్యాయుడు పలగాని రమేష్, గంగినేనికి చెందిన ఉపాధ్యాయురాలు ఉమాదేవి గైర్హాజరయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ వారికి నోటీసులు జారీ చేసినట్లు తహశీల్దార్ తెలిపారు. -
తేలని గన్నవరం టీడీపీ టిక్కెట్
వంశీమోహన్‌కు టిక్కెట్ హుళక్కేనా! దాసరి, వంశీ మధ్య కొనసాగుతున్న పోరు టీడీపీ శ్రేణులు వీడని అయోమయం మరోపక్క దుట్టా రామచంద్రరావు ప్రచార జోరు సాక్షి, విజయవాడ : వారిద్దరూ తెలుగుదేశం పార్టీకి కీలక నేతలే. ఒకే నియోజకవర్గం టిక్కెట్ కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. గెలుపు కంటే టిక్కెట్ సాధించడమే ఎక్కువ ప్రతిష్టగా తీసుకుని పావులు కదుపుతున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌లోనే మకాం వేసి లాబీయింగ్ నడుపుతున్నారు. ఎంత ప్రయత్నించినా ఈ ఇద్దరిలో ఒకరు టిక్కెట్ సంపాదించుకుని మొదటి జాబితాలో తమ పేరు ప్రకటించుకోలేకపోవడం వారి సమర్థతనే శంకిస్తోందని జిల్లా తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరికిటిక్కెట్ లభించినా రెండోవారే దగ్గరుండి ఓడిస్తారనేది నగ్న సత్యం. ఇద్దరూ ఇద్దరే! దాసరి బాలవర్ధనరావు గ న్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన సోదరుడు దాసరి జై రమేష్ టీడీపీలో కీలకమైన పారిశ్రామికవేత్త. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేశారు. అయినప్పటికీ తొలిజాబితాలో తన పేరు ఉండేలా చూసుకోలేకపోయారు. ఇక వల్లభనేని వంశీమోహన్ గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత పార్లమెంట్ ఇన్చార్జిగా పనిచేశారు. చివరకు గన్నవరానికి పరిమితమైపోయారు. గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్‌ను పొందిన వంశీమోహన్ ఇప్పుడు కనీసం గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు తనకే హామీ ఇచ్చారంటూ హడావుడి చేసిన వంశీమోహన్ తొలి జాబితాలో తన పేరు ఉండేలా చూసుకోలేకపోవడం సగం ఓటమి చెందినట్లేనని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. భిన్న ధ్రువాలు... దాసరి బాలవర్ధనరావు, వంశీమోహన్లు పార్టీలో భిన్న ధ్రువాలుగా గుర్తింపు పొందారు. చాపకింద నీరులా రాజకీయం చేయడం దాసరి ప్రత్యేకత అని పార్టీ శ్రేణుల అభిప్రాయం. వంశీమోహన్ చేసే ప్రతి కార్యక్రమంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే అధిష్టానానికి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు పంపారు. వంశీకి టిక్కెట్ ఇవ్వడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ అధిష్టానం చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. వంశీమోహన్ దుందుడుకు తత్వంతో నగర మాజీ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులుతోనే నేరుగా వివాదానికి దిగి పలు సమస్యలను కొని తెచ్చుకున్నారు. గతంలో వివిధ వర్గాలతో ఆయనకు ఉన్న విభేదాల కారణంగా ప్రజల్లో ఆయన ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం గన్నవరంలో ఒక యువకుడి హత్యకేసులో వంశీ అనుచరులు ఉన్నారంటూ ఆయన వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేసింది. ఇటీవల చంద్రబాబునాయుడు నగరానికి వస్తున్న సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద పోలీసు అధికారులతో వంశీ ఘర్షణకు దిగి పోలీసు అధికారుల్నే హెచ్చరించడం జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. సాధారణ నేతగా ఉండగానే అధికారులపై దూకుడుగా వ్యవహరిస్తున్న వంశీ, రేపు పదవి చేతికి వస్తే ఇంకెలా ఉంటారో అనే భయం నియోజకవర్గ వాసుల్లో వ్యక్తమవుతోంది. వంశీ దుందుడుకు స్వభావమే ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుపడుతోందనే అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు. పేదలతో మమేకమైన దుట్టా... ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పేదల వైద్యుడుగా గుర్తింపు పొందారు. ఆయన జేబును బట్టి కాకుండా రోగాన్ని బట్టి వైద్యం చేస్తారని నానుడి. ఆయనతో కొద్దిసేపు మాట్లాడితేనే రోగం సగం నయం అవుతుందని పేదలు నమ్ముతారు. టీడీపీలో ఇద్దరు నేతలూ బహిరంగంగానే కలహించుకుంటుంటే రామచంద్రరావు పేద ప్రజల్లోకి పార్టీని తీసుకెళుతూ దూసుకుపోతున్నారు. -
జననేత జగన్‌కే సాధ్యం
సమైక్య శంఖారావంలో వైఎస్సార్ సీపీ నేతలు గన్నవరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర సమైక్యత కోసం ఆహర్నిశలు పాటుపడుతున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని ఆ పార్టీ గన్నవరం, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఉప్పులేటి కల్పన, సింహద్రి రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయం ఆవరణంలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ సమైక్య శంఖారావం సభ జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి వారు మాట్లాడుతూ....రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాగల సత్తా, సామర్థ్యం కేవలం జగన్‌కు మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జగన్ జాతీయస్థాయిలో పెద్దఎత్తున పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్, టీడీపీలు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతంతో కళ్లబోల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యంధ్రా ముసుగులో విభజనకు సహాకరిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఉసరవల్లిలా రంగులు మారుస్తూ విభజనపై స్పష్టమైన ప్రకటన చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. శాసనసభలో టి-బిల్లుపై చర్చకు దూరంగా ఉంటూ ఇరు ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొడుతూ బాబు చేస్తున్న కుటీల రాజకీయాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. రానున్న కాలంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ముందుకు నడిపించే శక్తి జగన్‌కు మాత్రమే ఉందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు. పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గొసుల శివభరత్‌రెడ్డి, కాసర్నేని గోపాలరావు, కోటగిరి వరప్రసాదరావు, యార్కరెడ్డి నాగిరెడ్డి, తోట వెంకయ్య, ఆరుమాళ్ళ సాంబిరెడ్డి, ఎండీ. గౌసాని, కందిమాళ్ళ శ్రీనివాసరావు, కొల్లి రాజశేఖర్, మేచినేని బాబు, వింతా శంకరరెడ్డి, సూరం విజయకుమార్, సర్పంచి నీలం ప్రవీణ్‌కుమార్, పార్టీ నాయకులు చిమటా శ్రీనివాసరావు, నెరుసు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.