గన్నవరం: ఓ పక్క మహిళలు, బాలికలకు రక్షణగా నిలవాలి, గౌరవించాలి అని సీఎం చంద్రబాబు ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ.. మరోపక్క మహిళా ఎమ్మెల్యే అనే కనీస గౌరవం లేకుండా ఆర్కే రోజాను అసభ్యకరంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో తిట్టించడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గన్నవరం పార్టీ కార్యాలయంలో గురువారం విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, జోగి రమేశ్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న బుద్దా వెంకన్న సంస్కారహీనుడి వలే మాట్లాడుతుండటం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దాచేపల్లి ఘటనలో బాధితురాలి పక్షాన పోరాడిన రోజాను సభ్య సమాజం తలదించుకునే విధంగా బుద్దా మాట్లాడడం చూస్తుంటే టీడీపీకి మహిళలంటే ఏమాత్రం గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. ఇటువంటి బుద్ధిహీనులకు ప్రజలు తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ద్వారా డ్వాక్రా మహిళలు, రైతులు, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం వంటి సదుపాయాలన్నీ లభిస్తాయని అందరూ విశ్వసిస్తున్నారని తెలిపారు.
టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు: ఉదయభాను
విపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సామినేని ఉదయభాను అన్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని వర్గాల ప్రజలు జగన్ దృష్టికి తీసుకువెళుతున్నారని, ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు.
రోజాను కించపరిచే విధంగా అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఓ సంస్కారహీనుడని జోగి రమేశ్ ధ్వజమెత్తారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించిన నీచ చరిత్ర ఉన్న బుద్దా గురించి జిల్లా ప్రజలందరికి తెలుసన్నారు. ప్రజలు ఛీకొట్టిన వారందరిని టీడీపీలోకి తీసుకువచ్చి ఎమ్మెల్సీ, విప్ పదవులిచ్చిన చరిత్రహీనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. మహిళ అనే కనీస గౌరవం లేకుండా వ్యవహరించిన బుద్ధిహీనుడైన బుద్దాను చెప్పులతో కొట్టినా తప్పులేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment