పెదపాడు: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆటలు ఇక సాగవని, ఆయన పదవి ఊడటానికి ఇక నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని దెందులూరు వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడులో దెందులూరు కార్యకర్తల సమావేశంలో అబ్బయ్య చౌదరీ మాట్లాడారు. మట్టి నుంచి ఇసుక వరకు అన్నింటిలోనూ చింతమనేని దోపిడీ పాల్పడ్డారని ఆరోపించారు. అప్పన ప్రసాద్‌పై అక్రమ కేసులు , రౌడీషీట్‌తో వేధించినా ఆయన భయపడలేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించమని అన్నారు. చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడానికి దెందులూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చింతమనేని రౌడీయిజంతో దెందులూరు ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని వివరించారు.
చింతమనేని, వల్లభనేని ఇద్దరూ దోపిడీదారులే: దుట్టా
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా దోపిడీదారులేనని వైఎస్సార్‌సీపీ నేత దుట్టా రామచంద్ర రావు విమర్శించారు. నియోజకవర్గాల్లో సెటిల్‌మెంట్లు, ఇసుక, మట్టి అక్రమాలే కనిపిస్తాయని చెప్పారు. గాంధీజీకి జాతిపిత బిరుదును నేనే ఇచ్చానని కూడా చంద్రబాబు చెప్పుకోగల ఘనుడని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు ఎక్కడ పేరొస్తోందనే భయంతోనే పోలవరం కాలువకు ఆనాడు దేవినేని ఉమ లాంటి వారు అడ్డుపడ్డారని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని కోరుతున్నట్లు తెలిపారు.
లోకేష్ ఐటీ మంత్రి అయిన తర్వాత ఒక్క కంపెనీ రాలేదు: యార్లగడ్డ
లోకేష్ లాంటి దిక్కుమాలిన ఐటీ మంత్రి వచ్చిన తర్వాత ఒక్క ఐటీ కంపెనీ కూడా ఏపీకి రాలేదని గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. లోకేష్ కాకుండా మరెవరైనా ఐటీ మంత్రి అయ్యింటే కనీసం ఒకటో, రెండో ఐటీ కంపెనీలు వచ్చేవని చెప్పారు. చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తుతోనే అధికారంలోకి వచ్చారని, కానీ వైఎస్ జగన్ ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ నుంచి ఐదుగురు ఎంపీలు రాజీనామా చేయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం చాలా దుర్మార్గమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment