తేలని గన్నవరం టీడీపీ టిక్కెట్ | Vansimohan proud of the ticket! | Sakshi
Sakshi News home page

తేలని గన్నవరం టీడీపీ టిక్కెట్

Published Fri, Apr 11 2014 2:14 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

తేలని గన్నవరం టీడీపీ టిక్కెట్ - Sakshi

తేలని గన్నవరం టీడీపీ టిక్కెట్

  •  వంశీమోహన్‌కు టిక్కెట్ హుళక్కేనా!
  •   దాసరి, వంశీ మధ్య కొనసాగుతున్న పోరు
  •   టీడీపీ శ్రేణులు వీడని అయోమయం
  •   మరోపక్క దుట్టా రామచంద్రరావు ప్రచార జోరు
  •  సాక్షి, విజయవాడ : వారిద్దరూ తెలుగుదేశం పార్టీకి కీలక నేతలే. ఒకే నియోజకవర్గం టిక్కెట్ కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. గెలుపు కంటే టిక్కెట్ సాధించడమే ఎక్కువ ప్రతిష్టగా తీసుకుని పావులు కదుపుతున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌లోనే మకాం వేసి లాబీయింగ్ నడుపుతున్నారు. ఎంత ప్రయత్నించినా ఈ ఇద్దరిలో ఒకరు టిక్కెట్ సంపాదించుకుని మొదటి జాబితాలో తమ పేరు ప్రకటించుకోలేకపోవడం వారి సమర్థతనే శంకిస్తోందని జిల్లా తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరికిటిక్కెట్ లభించినా రెండోవారే దగ్గరుండి ఓడిస్తారనేది నగ్న సత్యం.
     
    ఇద్దరూ ఇద్దరే!
     
    దాసరి బాలవర్ధనరావు గ న్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన సోదరుడు దాసరి జై రమేష్ టీడీపీలో కీలకమైన పారిశ్రామికవేత్త. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేశారు. అయినప్పటికీ తొలిజాబితాలో తన పేరు ఉండేలా చూసుకోలేకపోయారు. ఇక వల్లభనేని వంశీమోహన్ గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత పార్లమెంట్ ఇన్‌చార్జిగా పనిచేశారు. చివరకు గన్నవరానికి పరిమితమైపోయారు.

    గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్‌ను పొందిన వంశీమోహన్ ఇప్పుడు కనీసం గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు తనకే హామీ ఇచ్చారంటూ హడావుడి చేసిన వంశీమోహన్ తొలి జాబితాలో తన పేరు ఉండేలా చూసుకోలేకపోవడం సగం ఓటమి చెందినట్లేనని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.  
     
    భిన్న ధ్రువాలు...
     
    దాసరి బాలవర్ధనరావు, వంశీమోహన్‌లు పార్టీలో భిన్న ధ్రువాలుగా గుర్తింపు పొందారు. చాపకింద నీరులా రాజకీయం చేయడం దాసరి ప్రత్యేకత అని పార్టీ శ్రేణుల అభిప్రాయం. వంశీమోహన్ చేసే ప్రతి కార్యక్రమంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే  అధిష్టానానికి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు పంపారు. వంశీకి టిక్కెట్ ఇవ్వడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ అధిష్టానం చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారు.

    వంశీమోహన్ దుందుడుకు తత్వంతో నగర మాజీ పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులుతోనే నేరుగా వివాదానికి దిగి పలు సమస్యలను కొని తెచ్చుకున్నారు. గతంలో వివిధ వర్గాలతో ఆయనకు ఉన్న విభేదాల కారణంగా ప్రజల్లో ఆయన ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం గన్నవరంలో ఒక యువకుడి హత్యకేసులో వంశీ అనుచరులు ఉన్నారంటూ ఆయన వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేసింది.

    ఇటీవల చంద్రబాబునాయుడు నగరానికి వస్తున్న సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద పోలీసు అధికారులతో వంశీ ఘర్షణకు దిగి పోలీసు అధికారుల్నే హెచ్చరించడం జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. సాధారణ నేతగా ఉండగానే అధికారులపై దూకుడుగా వ్యవహరిస్తున్న వంశీ, రేపు పదవి చేతికి వస్తే ఇంకెలా ఉంటారో అనే భయం నియోజకవర్గ వాసుల్లో వ్యక్తమవుతోంది. వంశీ దుందుడుకు స్వభావమే ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుపడుతోందనే అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు.
     
    పేదలతో మమేకమైన దుట్టా...
     
    ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పేదల వైద్యుడుగా గుర్తింపు పొందారు. ఆయన జేబును బట్టి కాకుండా రోగాన్ని బట్టి వైద్యం చేస్తారని నానుడి. ఆయనతో కొద్దిసేపు మాట్లాడితేనే రోగం సగం నయం అవుతుందని పేదలు నమ్ముతారు. టీడీపీలో ఇద్దరు నేతలూ బహిరంగంగానే కలహించుకుంటుంటే రామచంద్రరావు పేద ప్రజల్లోకి పార్టీని తీసుకెళుతూ దూసుకుపోతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement