రక్తసిక్తం | APSRTC bus killed five | Sakshi
Sakshi News home page

రక్తసిక్తం

Published Sun, Apr 20 2014 2:07 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

రక్తసిక్తం - Sakshi

రక్తసిక్తం

  • ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు    
  •   ఐదుగురి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
  •   మృతుల్లో భార్యాభర్తలు, కుమారుడు
  •   శోకసంద్రంలో బంధువులు
  •   పుణ్యకార్యానికి వెళ్లివస్తుండగా దుర్ఘటన
  •   వేమండలో విషాదఛాయలు
  •  పుణ్యకార్యానికి వెళ్లివస్తున్న వారిపై మృత్యువు కరాళనృత్యం చేసింది. నలభై రోజుల కఠిన దీక్షచేసి దైవసన్నిధిలో విరమించిన అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రైస్తవ భక్తులపైకి మృత్యుశకటంలా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఐదుగురి ప్రాణాలు తీసింది. మరో ఆరుగురిని ఆస్పత్రిపాలు చేసింది. కుమారుడు సహా దంపతులు ఈ ఘటనలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.
     
    పామర్రు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఉంగుటూరు మండలం వేమండ గ్రామానికి చెందిన 14 మంది క్రైస్తవ భక్తులు ఏసు దీక్ష విరమణ కోసం శుక్రవారం రాత్రి బయల్దేరి మచిలీపట్నం వెళ్లారు. మంగినపూడి బీచ్‌లోని వేళంగిణీ మాత ఆలయంలో శనివారం తెల్లవారుజామున పూజలు, దీక్షా విరమణ కార్యక్రమాలు ముగించి సముద్రంలో స్నానాలు పూర్తిచేసి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. వారిలో ముగ్గురు తమ మోటార్ బైక్‌పై మచిలీపట్నం నుంచి గుడివాడ మీదుగా వేమండ చేరుకుంటామని అటుగా వెళ్లారు. మిగిలిన 11 మంది బందరు నుంచి పామర్రు మీదుగా వేమండ చేరే విధంగా ఆటోలో బయలుదేరారు.

    పామర్రులోని 14వ మైలురాయి వద్దకు ఆటో చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని గోగులమూడి సురేష్ (35), గోగులమూడి జ్యోతి (30), గోగులమూడి అఖిల్ (8), కొసనం సతీష్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మత్తే జోజిబాబు (35) ప్రాణాలొదిలాడు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు 108కి, పోలీసులకు సమాచారమిచ్చారు. తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన గుడిపూడి పార్వతి, మన్నెంపల్లి తేరేజమ్మ, బిరుదుగడ్డ అనిత, బిరుదుగడ్డ దానియేలు, తోకల ఆంటోనమ్మ, తోకల ఆనందరావులను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
     
    మిన్నంటిన బంధువుల రోదనలు
     
    విషయం తెలుసుకున్న మృతుల బంధువులు వేమండ గ్రామం నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తమ వారి మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. బంధువులు రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. గుడివాడ డీఎస్పీ నాగన్న, పామర్రు సీఐ జి.శ్రీనివాస్‌యాదవ్, ఎస్‌ఐ విల్సన్‌బాబుతో కలిసి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
     
    కుమారుడు సహా తల్లిదండ్రులు మృతి...
     
    ఈ ఘటనలో మృతిచెందిన గోగులమూడి సురేష్, జ్యోతి దంపతులు. చనిపోయిన అఖిల్ వారి కుమారుడు. వారికి మరో ఇద్దరు కుమార్తెలు హన్సిక, లక్కీ ఉన్నారు. తల్లిదండ్రులు, సోదరుడు ఒకేసారి మృతిచెందడంతో వారు అనాథలుగా మిగిలారు.
     
    గుంత వల్లే ప్రమాదం?
     
    ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాతీయరహదారిపై పెద్ద గుంత ఉంది. దానిని తప్పించే ప్రయత్నంలోనే ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.  
     
    నేతల పరామర్శ...
     
    దుర్ఘటనపై సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్‌సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద వివరాలు తెలుసుకుని బాధితులను పరామర్శించారు. గ్రామ సర్పంచి శనగవరపు సాంబశివరావు తదితరులు బాధిత కుటుంబాలను ఓదార్చారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement