ప్రభంజనం
సాక్షి, గన్నవరం/ నూజివీడు : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో జిల్లాలో జనభేరి రెండోరోజు కూడా ఉత్సాహంగా సాగింది.ఓ వైపు ఎండ తీవ్రత పెరుగుతున్నా ప్రజలు లెక్క చేయకుండా విజయమ్మను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
దీంతో విజయమ్మ జనభేరి యాత్ర ఆద్యంతం అశేష జనహోరు నడుమ సాగింది. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి బయల్దేరి గన్నవరం చేరుకున్న విజయమ్మకు పార్టీ శ్రేణులు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో విమానాశ్రయం సెంటర్ వద్ద ఘనస్వాగతం పలికారు. భారీ ప్రదర్శనగా గన్నవరం చేరుకున్నారు.
స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో విజయమ్మ ప్రసంగించారు. ఆమె ప్రసంగం ఆద్యంతం అశేష జనవాహిని చప్పట్ల నడుమ సాగింది. చంద్రబాబు బూటకపు హామీలు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త వేషంతో వచ్చి చెప్పే కొత్త మాటలపై విజయమ్మ విమర్శలు గుప్పించగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రాజన్న రాజ్యం మళ్లీ తెచ్చుకోవటానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కె.పార్థసారథి, గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావు ప్రసంగించారు.
ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ...
పోరాటాల్లోంచి పుట్టి.. నిత్యం ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని విజయమ్మ తెలిపారు. గన్నవరం నుంచి తోటపల్లి, సింగన్నగూడెం మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ ఆగిరిపల్లి చేరుకున్న విజయమ్మ అక్కడ సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు, ఉద్యోగులకు ఏంచేశారని ఆమె ప్రశ్నించారు. గ్యాస్, విత్తనాలు, ఎరువుల ధరలు ఇలా అన్నీ పెంచారా లేదా అని ప్రజల్ని ప్రశ్నించినప్పుడు వారినుంచి విశేష స్పందన వచ్చింది. విలువలు, విశ్వసనీయత కోసం ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజయమ్మ కోరారు.
అనంతరం అక్కడినుంచి నూగొండపల్లి, పిన్నమరెడ్డిపల్లి, ఎస్‌ఏ పేట, శోభనాపురం, ఈదర, కొత్త ఈదర, సీతారామపురం, యనమదల గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. అక్కడ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని ధర్మాజీగూడెం మండలానికి విజయమ్మ పయనమయ్యారు. వైఎస్సార్ జనభేరిలో పార్టీ ఎంపీ అభ్యర్థులు కె.పార్థసారథి (మచిలీపట్నం), డాక్టర్ తోట చంద్రశేఖర్ (ఏలూరు), ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు (గన్నవరం), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు) పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇద్దరు టీచర్లకు షోకాజ్
జి.కొండూరు, న్యూస్‌లైన్ : ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన ఇద్దరు టీచర్లకు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు స్థానిక తహశీల్దార్ మదనగోపాలరావు తెలిపారు. ఈ నెల 13న మైలవరంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుదర్శన్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిన వెలగలేరు జిల్లా పరిషత్‌కు చెందిన ఉపాధ్యాయుడు పలగాని రమేష్, గంగినేనికి చెందిన ఉపాధ్యాయురాలు ఉమాదేవి గైర్హాజరయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ వారికి నోటీసులు జారీ చేసినట్లు తహశీల్దార్ తెలిపారు.