శివ శివా ఎంత నిర్లక్ష్యం
- నాడు గాలిగోపురం కూలింది
- నేడు మండపం కుంగింది
- కొబ్బరిచిప్పలు, నూనెడబ్బాలు పిచ్చిమొక్కలతో దెబ్బతిన్న ఆలయం
- స్తపతుల ఆదేశాలు సరే.. ఆచరణ మాటేంటో?
శ్రీకాళహస్తి: గోపురం కూలినా, ఆలయపైకప్పు పెచ్చులూడి పడుతున్నా కాళహస్తీశ్వరాలయూధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఆలయగోపురమే కూలిపోగా, శుక్రవారం ఆల యంలో ఒకమండపం కుంగిపోయింది. ఆలయం పైభాగంలో పిచ్చిమొక్కలు మొలిచినా పట్టించుకోకపోవడం, నూనె డబ్బాలు, కొబ్బరిచిప్పలు ఎండబెట్టడం కారణంగా ఆలయగోడలు దెబ్బతింటున్నాయి.
శ్రీకాళహస్తి దేవస్థానంతో పాటు పలు మండపాలు, గోపురాలు మరమ్మతులు చేయించాలని రెండేళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర దేవాదాయశాఖ స్తపత్తులు వేలు, సుందరాజన్ పలుసార్లు ఆల యాన్ని పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. చిన్నపాటి వర్షాలకే ఆలయగోడలు తడి సి ముద్దవుతున్నాయి. పిచ్చిమొక్కల కారణంగా ఆలయ గోడలు పగుళ్లు వస్తున్నాయి. ఆలయ గాలిగోపురం 2010 మే 26వ తేదీ కుప్పకూలిపోయింది. నాలుగేళ్లు గడుస్తున్నా గోపురం పనులు పునాదులకే పరిమితమయ్యూయి.
ఆ తరువాత ఆరు నెలల వ్యవధిలోనే కైలాసగిరి కొండల్లో వేయిలింగాల కోనలోని సహస్రలింగేశ్వరస్వామి ముఖద్వార గాలిగోపురం కుప్పకూలే దిశలో ఉందని స్థానికులు గుర్తించడంతో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలోనే జ్ఞానప్రసూనాంబ, భిక్షాలగోపురం పైభాగం నుంచి కలశరాళ్లు, ఆలయంలోపల దక్షిణామూర్తి పైభాగం నుంచి రాళ్లు, గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ పైకప్పు పెచ్చులు ఊడిపడిన విషయం తెలిసిందే. అయినా అధికారులు ఆ సమయం లో మాత్రమే స్పందించడం.. .హంగామా చేయడం ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. తాజాగా అష్టోత్తరలింగం మండపం కుంగడం..కూలడానికి సిద్ధంగా ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
కుంభాభిషేకం చేయాలని భావిస్తున్నాం...
ఆలయంలో త్వరలో కుంభాభిషేకం చేయాలని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించాలని రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులకు తెలియజేశాం. వారు సానుకూలంగా స్పందిం చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
-శ్రీనివాసరావు, ఆలయ ఈవో