జాతీయ రహదారిపై లారీలను ఆపుతున్న మద్దిపాడు లారీ యూనియన్ సభ్యులు
మద్దిపాడు (ప్రకాశం): లారీ వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ల సమ్మె రోజు రోజుకూ ఉధృతమౌతోంది. గత నాలుగు రోజులుగా పలు లారీ యూనియన్ ఆఫీసులు సమ్మెలో పొల్గొంటూ లారీలు తిప్పడం లేదు. బుధవారం రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జాతీయ రహదారిపై మద్దిపాడు యూనియన్ నాయకులు లారీలు నిలిపేశారు. సుమారు గంటపాటు లారీలను నిలిపివేయడంతో 4 కిలోమీటర్ల దూరం వాహనాలు ఆగిపోయాయి. యూనియన్ నాయకులు మాట్లాడుతూ పెరిగిన డీజిల్ ధరను తగ్గించాలని, జీఎస్టీని ఎత్తివేయాలని, టోల్‌గేట్ల వద్ద భారీగా ట్యాక్స్ వసూలు చేయటాన్ని నిరశిస్తూ నినాదాలు చేశారు. లారీలు ఆపిన యూనియన్ సభ్యులు లారీ డ్రైవర్లకు మజ్జిగ పంపిణీ చేశారు.
పెద్ద ఎత్తున లారీలు నిలిచిపోవటంతో మద్దిపాడు ఎస్‌ఐ పి. సురేష్ లారీ యూనియన్ కార్యాలయం వద్దకు చేరుకుని యూనియన్ నాయకులతో మాట్లాడారు. యూనియన్ నాయకులు ఆయనతో మాట్లాడుతూ కేవలం లారీలను మాత్రమే ఆపుతున్నామని, మరే ఇతర వాహనాలను అత్యవసర సర్వీసులను ఆపడం లేదని తెలిపారు. ఎస్‌ఐ వారితో మాట్లాడిన అనంతరం లారీలను పంపించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో ఆయన వెంట మద్దిపాడు పోలీసు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment