ఆదోని/నంద్యాల(కర్నూలు):జీవన సమరంలో అనుకోని విపత్తు. ఎన్నడూ ఎదురవ్వని పరిణామాలు. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు. అయినా బతుకు పయనం ఆగలేదు. కరోనా దారిలో కొందరు తమ బతుకు చక్రాన్ని మార్చుకుని ముందుకు సాగుతున్నారు. కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో పరిశ్రమలు, కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు, పరిశ్రమలు, మాల్స్, వస్త్ర, బంగారు, వర్తక, వాణిజ్య సముదాయాలు మూత పడ్డాయి. దీంతో జిల్లాలో వేలాది మంది చిరుద్యోగులు, దినసరి కూలీలు ఇబ్బంది పడ్డారు. తమను నమ్ముకున్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలను పోషించడానికి ప్రత్యామ్నాయంగా ఇతర వ్యాపారాలవైపు చూస్తున్నారు. అవకాశం ఉన్న వృత్తులు, వ్యాపారాలు, కూలి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
బండి అదే.. వ్యాపారం వేరు
లాక్‌డౌన్‌కు ముందు ఉదయం నుంచి రాత్రి వరకు తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసేవాడిని. సాయంత్రంలోగా రూ.2000 వరకు వ్యాపారం అయ్యేది. దీనిపై రూ.300 వరకు మిగులు ఉండేది. అయితే లాక్‌డౌన్‌లో ఉదయం 6 గంటల నుంచి మూడు గంటల పాటు మాత్రమే అమ్ముకోడానికి అనుమతి ఇచ్చారు. అయినా వైరస్ అంటుకుని ఉంటుందని చాలా మంది పండ్లు కొనడానికి కూడ సహసించలేదు. దీంతో వ్యాపారం తగ్గిపోయింది. పండ్లు చెడిపోవడంతో బాగా నష్టపోయాను. కొన్ని రోజులు వ్యాపారం వదిలేసి ఇంట్లో ఉన్నాను. జేబులో పైసా లేదు. అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు పిల్లలు పస్తులుంటే ఎలా భరించగలను. నా భార్య సూచన మేరకు అదే తోపుడు బండిలో కూరగాయలు వేసుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాను.
– రాజు, వడ్డేగేరి, ఆదోని
నాడు రైల్వే కూలీ.. నేడు ఉపాధి కూలీ
నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన చెన్నయ్య 14 ఏళ్లుగా నంద్యాల రైల్వే స్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయంలో రైల్వే కూలీగా పని చేసేవాడు. దీంతో అతనికి రోజూ రూ.350 – 500 కూలి వస్తుండటంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. లాక్‌డౌన్‌తో మూడు నెలలుగా రైళ్లు తిరగక పోవడం, స్టేషన్‌లో పని లేక కుటుంబ పోషణ భారంగా మారింది. తన స్నేహితుని సలహాతో 20 రోజుల క్రితం మండల ఉపాధి కార్యాలయానికి వచ్చి జాబ్ కార్డు పొందాడు. దీంతో ప్రతి రోజు ఉపాధి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రైల్వేలో పార్సిల్ పని కంటే ఉపాధి కూలీ పని చాలా బాగుందని, అయితే ప్రతి రోజు రూ.200 మాత్రమే వస్తుందని చెబుతున్నాడు. ఖర్చులు తగ్గించుకోవడంతో ఎలాంటి సమస్య లేదంటున్నాడు.
పూలు అమ్మిన చోటే..
నంద్యాల పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన నాగలక్ష్మమ్మ టెక్కె ఎస్‌బీఐ ఏటీఎం వద్ద పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. నేడు కరోనా వైరస్‌తో పూలు కొనుగోలు చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో రోజు నష్టం వస్తుండటంతో పూలు అమ్మిన చోటనే అదే బండిపై కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని అండగా నిలుస్తోంది.
అనుభవం లేకపోయినా..
నంద్యాల పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీకి చెందిన గుర్రప్ప స్థానిక గురురాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే చిన్నపాటి హోటల్ నడుపుతూ జీవనం సాగించే వారు. బ్యాంక్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు వేల సంఖ్యలో ఉండటంతో వ్యాపారం బాగానే ఉండేది. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌తో వ్యాపారం పూర్తిగా దెబ్బతినింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తేవేసిన బ్యాంక్ కోచింగ్ సెంటర్ ప్రారంభించకపోవడంతో హోటల్ వ్యాపారాన్ని మూసివేసి ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నాడు హోటల్ నిర్వహించేటప్పుడు రోజుకు రూ.1500 నుంచి రూ.2 వేలు వస్తుండగా నేడు రూ.500 మిగులు కష్టమేనని, కుటుంబ పోషణ కోసం ఏదైన పని చేయాలన్న ఉద్దేశంతోనే అనుభవం లేకపోయినా ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నానని గుర్రప్ప చెబుతున్నాడు.
చిల్లర దుకాణం పెట్టా
లాక్‌డౌన్ కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఎక్కడో ఒకటి, అర జరిగినా ఫొటో, వీడియోలు తీయించడం లేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఫొటో, వీడియో గ్రాఫర్‌గా పని చేసిన నాకు ఎక్కడ పని లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బంతా లాక్‌డౌన్‌లో బతికేందుకు ఖర్చుయింది. ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇంట్లో జరుగుబాటు లేకుండా పోయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాలి. సమీప బంధువులు, మిత్రుల సహకారంతో ఇంట్లోనే చిల్లర దుకాణం పెట్టుకున్నాను. కుటుంబం గడిచేందుకు ఇబ్బంది లేదు. కరోనా వైరస్ విస్తృతి ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. స్కూళ్లు తెరుచుకుంటే పిల్లలకు రూ.వేలల్లో ïఫీజులు చెల్లించాలి. చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వ పాఠశాలకు పంపడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నాను.
– లక్ష్మన్న, వీడియో గ్రాఫర్, కౌడల్‌పేట, ఆదోని
ఉపాధి పనికి పోతున్నా
నేను ఆదోని పట్టణంలోని గూళ్యం ఇండస్ట్రీస్‌లో 8 ఏళ్లుగా పని చేస్తున్నాను. లాక్‌డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో నా సొంతూరు జాలిమంచికి చేరుకొని భార్య నాగేశ్వరమ్మతో పాటు కొడుకు, కూతరుతో కలిసి ప్రస్తుతం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్తున్నాం. ఫ్యాక్టరీ నడిచే సమయంలో ఇద్దరు పిల్లలు చదువుకునేవారు. ప్రస్తుత ఇల్లు గడవకపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నాం. దీంతో రోజుకు రూ.500 కూడా రావడం లేదు. అప్పట్లో నేనొక్కడినే రోజు రూ.500–1000 వరకు సంపాదించే వాడిని.
– వీరారెడ్డి, హమాలీ, ఆదోని
వ్యాపారం బాగుంది
ఆదోనిలోని ఓ ఫ్యాక్టరీలో టెక్నీషియన్‌గా పని చేస్తూ రోజుకు రూ.500 నుంచి 1200 వరకు సంపాదించే వాడిని. కరోనా కారణంగా ఫ్యాక్టరీ మూతపడటంతో పని పోయింది. నాకు భార్య ముంతాజ్, కొడుకు ఇమ్రాన్, కూతురు తాహెరాబేగం ఉన్నారు. డబ్బులు లేక కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీంతో కూరగాయలు వ్యాపారం చేపట్టా. రోజుకు రూ.220 లోపు మిగులుతోంది. ఖాళీగా ఉండటం కంటే ఇదే మేలు
– రంజాన్‌బాషా, టెక్నీషియన్, ఆదోని
కూలీగా మారి పొలానికి..
నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన జయమ్మ లాక్‌డౌన్‌కు ముందు అదే కాలనీలో టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగించేది. లాక్‌డౌన్‌లో మూడు నెలలు టిఫిన్ సెంటర్ మూత వేయాల్సి వచ్చింది. ప్రస్తుతంæ తెరిచినా జరగకపోవడంతో చేసేదేమీ లేక నేడు వ్యవసాయ కూలీగా మారింది. స్థానికులు సమీప గ్రామాల రైతుల పొలానికి కూలీకి వెళ్తుండగా వారితో ఆమె వెళ్తూ జీవనం సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment