సాక్షి, హైదరాబాద్: నిత్యం రయ్యిన దూసుకుపోయే వాహనాలకు లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ బ్రేక్ పడింది. లక్షలాది వాహనాలకు ‘తాళం’ పడింది. ప్రస్తుతం అత్యవసరమైతే తప్ప ఎవరూ బండి బయటకు తీయట్లేదు. రవాణాశాఖ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 55 లక్షల వాహనాల్లో 85 శాతం ఇళ్లకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్ మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్న దృష్ట్యా వాహనాల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రవాణా రంగ నిపుణులు, మెకానిక్‌లు సూచిస్తున్నారు. రోజూ కొద్దిసేపు బండి బయటకు తీయాలని, ఇంజన్, బ్యాటరీ, బ్రేకులు, టైర్లు, ఇంధన సంరక్షణ అంశాల పనితీరును పరిశీలించాలని అంటున్నారు.
బ్యాటరీ బాగుండాలంటే..
ఎలాగూ బయటికెళ్లే అవకాశం లేదు. ఇంక బండి బయటకు తీయడమెందుకని చాలామంది భావిస్తారు. పైగా పెట్రోల్, డీజిల్ ఆదా అవుతాయని అనుకుంటారు. కానీ రోజుల తరబడి వాహనాలు నడపకపోవడం వల్ల బ్యాటరీలు చెడిపోయి త్వరగా డిశ్చార్జి అవుతాయి. ఖరీదైన కార్లకు సైతం బ్యాటరీయే కీలకం. అకస్మాత్తుగా బ్యాటరీ డిశ్చార్జి అయిపోయి నడిరోడ్డుపై వాహనం ఆగిపోతే ఆ బాధెలా ఉంటుందో చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోజులో కొద్దిసేపైనా బండిని బయటకు తీయాలి. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా కనీసం కిలోమీటర్ దూరం నడిపి తిరిగి ఇంట్లో పార్క్ చేసుకోవాలి. నిబంధనలు ఆ మేరకు కూడా అనుమతించకుంటే, కనీసం ఇంజన్ స్టార్ట్‌చేసి కొద్దిసేపు అలాగే ఆన్‌లో ఉంచాలి. ఏడాది దాటిన బ్యాటరీలైతే ఇంకా త్వరగా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్త అవసరం. బ్యాటరీలు చెడిపోతే ఏసీలో గ్యాస్ డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. ఇక, రోజూ వాహనాన్ని శుభ్రంగా తుడవడం వల్ల తప్పు, మరకలు పట్టవు.
ఎలుకలతో జాగ్రత్త..
♦ వాహనాలను ఎక్కువ రోజులు బయటకు తీయకపోతే ఇంజిన్ కూల్ అయిపోతుంది. అదే సమయంలో కార్ల బాయినెట్‌లోకి ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలు చేరవచ్చు. ఇవి ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో వైర్లను తెంచేసే ప్రమాదం ఉంది.
♦ తెగిపోయిన వైర్ల వల్లనే చాలావరకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ అవుతుంది. కాబట్టి రోజుకు ఒక్కసారైనా బాయ్‌నెట్ తెరిచి పరిశీలించాలి.
♦ వాహనాల్లో ఇంజిన్ ఆయిల్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. వాహనాల సామర్థ్యం, తయారీకి అనుగుణంగా కనిష్ట, గరిష్ట స్థాయిలను అంచనా వేసుకోవాలి.
♦ టైర్ల నాణ్యత, మన్నిక, వాటి సామర్థ్యం మేరకు గాలిపీడనం (పీఎస్‌ఐ) ఉండేలా చూసుకోవాలి.
♦ ముఖ్యంగా కార్లలో ఒక్కోసారి హ్యాండ్ బ్రేక్స్ జ్యామ్ కావచ్చు. అలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా జాగ్రతలు తీసుకోవాలి.
♦ బైక్‌ల్లో పెట్రోల్ ఆఫ్‌లో ఉంచాలి. వాహనం బయటకు తీయనప్పుడు ఆన్‌లో ఉంచడం వల్ల ఇంధనం ఓవర్‌ఫ్లో అయ్యే ప్రమాదం ఉంది.
♦ బ్యాటరీ ఆధారిత వాహనాలను రోజూ కొద్దిసేపైనా బయటకు తీయాలి.
♦ ద్విచక్ర వాహనాలను స్టార్ట్ చేసేటపుడు మొదట సెల్ఫ్ స్టార్ట్ కంటే కిక్ స్టార్ట్‌ను ఉపయోగించాలి.
♦ బండి ఎండలో ఉంచితే ఇంధనం ఆవిరవుతుంది. టైర్లలో గాలి తగ్గిపోతుంది. కాబట్టి వాహనాలకు రక్షణ తొడుగులు వాడాలి.
బండి నడపకుంటే బ్యాటరీకి దెబ్బే
వాహనాలను రోజుల తరబడి బయటకు తీయకపోవడం వల్ల బ్యాటరీలే మొదట దెబ్బతింటాయి. కొత్త వాహనాల్లో ఈ ఇబ్బంది వెంటనే రాకున్నా ఏడాది కంటే ఎక్కువ వినియోగంలో ఉన్న వాటిలో ఈ ఇబ్బందులొస్తాయి. రోజుకు ఒక్కసారైనా బండి స్టార్ట్ చేయాలి. ఏవైనా ఇబ్బందులుంటే రెగ్యులర్ మెకానిక్‌ను ఫోన్లో సంప్రదించి సలహా తీసుకోవాలి. ఆన్‌లైన్‌లోనూ మెకానిక్‌ల సలహా, సూచనలు లభిస్తాయి.
– ప్రభాకర్, సీనియర్ మెకానిక్, వీఎస్టీ
Comments
Please login to add a commentAdd a comment