డెయిరీకి లాభాలు... మాకు నష్టాలా?
- రైతుల కష్టంతో కల్యాణమండపాలా?
- ఎంత పాలు పోసినా గిట్టుబాటు కాదు
- విశాఖ డెయిరీ డెరైక్టర్‌పై పాడి రైతుల ధ్వజం
అచ్యుతాపురం : వెన్న తీసిన పాలను విశాఖ డెయిరీ లీటరు రూ.40కి అమ్ముకుంటుంది. మాకు మాత్రం వెన్నశాతం తక్కువన్న సాకుతో లీటరుకు రూ.15 ఇస్తుంది. లీటరు నీళ్లు బయట రూ.20కి అమ్ముతున్నారు. మేము సరఫరా చేసిన పాలు నీళ్ల పాటి చేయలేదా? మీరు చెప్పేవన్నీ రైతుల కోసం కాదు... డెయిరీ బాగుపడేందుకే’... అంటూ పాడి రైతులు విశాఖ డెయిరీ డెరైక్టర్ పిళ్లా రమాకుమారిపై మండిపడ్డారు.
తిమ్మరాజుపేట పాల కేంద్రంలో బుధవారం 138 మంది రైతులకు రూ.2లక్షల 45,982 ఏరువాక బోనస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు కల్పించుకుని ఎన్ని పాలు పోసినా తమకు లాభాలు రావడం లేదని ఆరోపించారు. పశువులను పోషించి పాలు సరఫరా చేస్తే తమకు ఏమీ దక్కడం లేదని అసహనం వ్యక్తం చేసారు.
లీటరు పాలకు రూపాయి పెంచి దాణా బస్తా ధరను రూ.50కి పెంచారన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే డెయిరీకి వచ్చిన లాభాలను కల్యాణమండపాలు, వంతెనల నిర్మాణానికి కేటాయించడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ప్రయివేటు డెయిరీల నుంచి పాల ఉత్పత్తిదారులను ఆకట్టుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కుగా అభివర్ణించారు. వెన్నశాతం తీయడంలోను పలు అనుమానాలు ఉన్నాయని రైతులు తెలిపారు.
రైతుల ఆరోపణలకు రమాకుమారి సమాధానమిస్తూ వెన్నశాతంలో అనుమానాలను తొల గించడానికి లేజర్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. పాలను వేరుచేసి వెన్న శాతంలో లోపాల్లేకుండా చూసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, పీలా తులసీరాం, సత్యారావు పాల్గొన్నారు.