Pilla ramakumari
-
డెయిరీకి లాభాలు... మాకు నష్టాలా?
రైతుల కష్టంతో కల్యాణమండపాలా? ఎంత పాలు పోసినా గిట్టుబాటు కాదు విశాఖ డెయిరీ డెరైక్టర్‌పై పాడి రైతుల ధ్వజం అచ్యుతాపురం : వెన్న తీసిన పాలను విశాఖ డెయిరీ లీటరు రూ.40కి అమ్ముకుంటుంది. మాకు మాత్రం వెన్నశాతం తక్కువన్న సాకుతో లీటరుకు రూ.15 ఇస్తుంది. లీటరు నీళ్లు బయట రూ.20కి అమ్ముతున్నారు. మేము సరఫరా చేసిన పాలు నీళ్ల పాటి చేయలేదా? మీరు చెప్పేవన్నీ రైతుల కోసం కాదు... డెయిరీ బాగుపడేందుకే’... అంటూ పాడి రైతులు విశాఖ డెయిరీ డెరైక్టర్ పిళ్లా రమాకుమారిపై మండిపడ్డారు. తిమ్మరాజుపేట పాల కేంద్రంలో బుధవారం 138 మంది రైతులకు రూ.2లక్షల 45,982 ఏరువాక బోనస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు కల్పించుకుని ఎన్ని పాలు పోసినా తమకు లాభాలు రావడం లేదని ఆరోపించారు. పశువులను పోషించి పాలు సరఫరా చేస్తే తమకు ఏమీ దక్కడం లేదని అసహనం వ్యక్తం చేసారు. లీటరు పాలకు రూపాయి పెంచి దాణా బస్తా ధరను రూ.50కి పెంచారన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే డెయిరీకి వచ్చిన లాభాలను కల్యాణమండపాలు, వంతెనల నిర్మాణానికి కేటాయించడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ప్రయివేటు డెయిరీల నుంచి పాల ఉత్పత్తిదారులను ఆకట్టుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కుగా అభివర్ణించారు. వెన్నశాతం తీయడంలోను పలు అనుమానాలు ఉన్నాయని రైతులు తెలిపారు. రైతుల ఆరోపణలకు రమాకుమారి సమాధానమిస్తూ వెన్నశాతంలో అనుమానాలను తొల గించడానికి లేజర్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. పాలను వేరుచేసి వెన్న శాతంలో లోపాల్లేకుండా చూసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, పీలా తులసీరాం, సత్యారావు పాల్గొన్నారు. -
స్థానిక సంరంభం
స్థానిక సంస్థలఎన్నికలకు ఏర్పాట్లు జూలై 3న మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక 4న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఓటింగ్ 5న జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జెడ్పీ చైర్‌పర్సన్‌గా లాలం భవానికి చాన్స్ 39 ఎంపీపీల్లో 23 టీడీపీ, 12 వైఎస్ఆర్సీపీ కైవసం నాలుగింటిలో హంగ్ స్వతంత్రులే కీలకం విశాఖ రూరల్ : ఎట్టకేలకు ‘స్థానిక’ పీఠాల అధిరోహణకు ముహూర్తం ఖరారైంది. అధికార పగ్గాలు చేట్టేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజాప్రతినిధులకు ఆ తరుణం రానేవస్తోంది. స్థానిక సంస్థల చైర్పర్సన్ల ఎన్నికలను జూలై మొదటి వారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 3న పరీక్ష పద్దతిలో మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరగనుంది. జూలై 4న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉంటుంది. జూలై 5న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు మున్సిపాలిటీలు టీడీపీవే జిల్లాలో యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటిని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. యలమంచిలి మున్సిపాలిటీలో 24 వా ర్డులు ఉండగా టీడీపీ 21 స్థానాలు దక్కించుకుంది. వైఎస్ఆర్సీపీ మూడు వార్డుల్లో గెలిచింది. ఇక్క డ 2వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థిని పిళ్లా రమాకుమారి చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించనున్నారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డులలో టీడీపీ 19, వైఎస్ఆర్సీపీ 6, కాంగ్రెస్ 1, సీపీఐ 1 వార్డులలో గెలుపొందాయి. ఇక్కడ 25వ వార్డు నుంచి విజయం సాధించిన చింతకాయల అనితకు చైర్పర్సన్ పదవి వరించనుంది. ఆమె భర్త చింతకాయల సన్యాసిపాత్రుడు వైస్ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. ఈయన మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా భవాని : జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో తెలుగుదేశం 24 జెడ్పీటీసీలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ 15 జెడ్పీటీసీలను గెలుచుకున్నాయి. టీడీపీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాంబిల్లి మండలం నుంచి గెలిచిన లాలం భవానిని చైర్పర్సన్ అభ్యర్థినిగా ఎన్నికలకు ముందే టీడీపీ ప్రకటించింది. జూలై 1న కలెక్టర్ ఆరోఖ్యరాజ్ గెలిచిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. జూలై 5న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులు చెతులు ఎత్తే విధానంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. రసవత్తరంగా ఎంపీటీసీ అధ్యక్ష ఎన్నికలు : మండల పరిషత్తుల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు మాత్రం రసవత్తరంగా జరగనున్నాయి. జిల్లాలో 656 ఎంపీటీసీలలో రెండు వాయిదా పడగా 654 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 334 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 254, కాంగ్రెస్ 17, సీపీఎం 5, సీపీఐ 3, బీజేపీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో గెలవగా, స్వతంత్రులు 39 స్థానాల్లో విజయం సాధించారు. 39 మండల పరిషత్‌లలో 23 ఎంపీపీలను టీడీపీ, 12 ఎంపీపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకున్నాయి. నాలుగు ఎంపీపీల విషయంలో హంగ్ ఏర్పడింది. -
ఏకగ్రీవం వెనుక...
రమాకుమారి సేవలకు ప్రతిఫలమంటున్న మద్దతుదారులు ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్న వ్యతిరేకులు యలమంచిలి, న్యూస్‌లైన్ : ఊహించిన విధంగానే రెండో వార్డు ఎన్నిక ఏకగ్రీవమయింది. సోమవారం ఈ వార్డులో 8మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ వార్డునుంచి పోటీలో ఉన్న దేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమారి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఈ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి దేశంపార్టీ చైర్పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమా రి లక్షల రూపాయలు గ్రామాభివృద్దికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెండో వార్డులో మొత్తం 11 నామినేషన్లు దాఖలు కాగా అందు లో మూడు సెట్లు రమాకుమారివే. సోమవారం మిగతా 8మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయమే జరిగిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అన్ని నామినేషన్లు ఒకే రోజు ఉపసంహరించుకోవడంతో రెండో వా ర్డులో అభివృద్ధికి డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలకు బలాన్నిస్తోంది. వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి గత కొన్ని రోజులుగా దేశం పార్టీ నాయకులు పావులు కదిపారు. గ్రామంలో దేవాలయ అభివృద్ధికి సహకారిస్తే ఏకగ్రీవానికి ప్రయత్నిస్తామని గ్రామస్థులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా గ్రామంలో చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఫలవంతం కావడంతో నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో గ్రామస్థులకు, చైర్పర్సన్ అభ్యర్థికి మద్య జరిగిన ఒప్పందంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు పట్టణానికి చెందిన కె.సతీష్, యు.జయంత్, ఎం.రాంబాబు స్థానిక విలేకర్లకు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయడం, ఉపసంహరించుకోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఉపసంహరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు తెలుస్తోందని, ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన పిళ్లా రమాకుమారి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్లనే ఆమెను వార్డు మెంబరుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు గ్రామస్థులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం గ్రామాభివృద్ధి కోసమే ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.