ఏకగ్రీవం వెనుక...
- రమాకుమారి సేవలకు ప్రతిఫలమంటున్న మద్దతుదారులు
- ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్న వ్యతిరేకులు
యలమంచిలి, న్యూస్‌లైన్ : ఊహించిన విధంగానే రెండో వార్డు ఎన్నిక ఏకగ్రీవమయింది. సోమవారం ఈ వార్డులో 8మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ వార్డునుంచి పోటీలో ఉన్న దేశం పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమారి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఈ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి దేశంపార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమా రి లక్షల రూపాయలు గ్రామాభివృద్దికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
రెండో వార్డులో మొత్తం 11 నామినేషన్లు దాఖలు కాగా అందు లో మూడు సెట్లు రమాకుమారివే. సోమవారం మిగతా 8మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయమే జరిగిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అన్ని నామినేషన్లు ఒకే రోజు ఉపసంహరించుకోవడంతో రెండో వా ర్డులో అభివృద్ధికి డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలకు బలాన్నిస్తోంది.
వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి గత కొన్ని రోజులుగా దేశం పార్టీ నాయకులు పావులు కదిపారు. గ్రామంలో దేవాలయ అభివృద్ధికి సహకారిస్తే ఏకగ్రీవానికి ప్రయత్నిస్తామని గ్రామస్థులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా గ్రామంలో చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఫలవంతం కావడంతో నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో గ్రామస్థులకు, చైర్‌పర్సన్ అభ్యర్థికి మద్య జరిగిన ఒప్పందంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు పట్టణానికి చెందిన కె.సతీష్, యు.జయంత్, ఎం.రాంబాబు స్థానిక విలేకర్లకు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయడం, ఉపసంహరించుకోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
ఉపసంహరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు తెలుస్తోందని, ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన పిళ్లా రమాకుమారి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్లనే ఆమెను వార్డు మెంబరుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు గ్రామస్థులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం గ్రామాభివృద్ధి కోసమే ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.