‘గ్రేటర్‌’వ్యూహంపై నేడు కేసీఆర్‌ దిశానిర్దేశం | GHMC Elections 2020: CM KCR To Holds Meeting On Wednesday | Sakshi
Sakshi News home page

దండుగా కదలాలి.. దండిగా గెలవాలి 

Published Wed, Nov 18 2020 11:58 AM | Last Updated on Wed, Nov 18 2020 12:38 PM

GHMC Elections 2020: CM KCR To Holds Meeting On Wednesday - Sakshi

‘గ్రేటర్‌’నగారా మోగడంతో టీఆర్‌ఎస్‌ తమ శ్రేణులను కదనరంగానికి కార్యోన్ముఖుల్ని చేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఇప్పటికే ఖరారు చేసిన టీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మోహరించడంపై దృష్టి సారించింది. ‘మినీ అసెంబ్లీ’ని తలపించే గ్రేటర్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ యంత్రాంగానికి బుధవారం మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని సందేశం పంపించారు. అభ్యర్థులు, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచారం, విపక్ష పార్టీల ఎత్తుగడలు, సభలు, సమావేశాలు, పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై పార్టీ అధినేత కేసీఆర్‌ పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
– సాక్షి, హైదరాబాద్‌

నేడు అభ్యర్థుల తొలి జాబితా? 
పార్టీ కార్పొరేటర్ల పనితీరుపై పలు దఫాలుగా అంతర్గత సర్వేలు నిర్వహించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు పూర్తి చేసింది. డివిజన్ల వారీగా రిజర్వేషన్లు యధాతథంగా కొనసాగుతుండటంతో అభ్యర్థుల పనితీరు, విపక్ష పార్టీల అభ్యర్థులు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని గెలుపు గుర్రాలను గుర్తించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలోని ‘వార్‌ రూమ్‌’గతంలోనే మంతనాలు జరిపి అభిప్రాయాన్ని సేకరించింది. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుండటం, నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో బుధవారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది. చదవండి: ట్రెండ్‌ చేంజ్.. కాదేదీ గుర్తుకు అనర్హం..!

సుమారు 85 శాతం మంది సిట్టింగ్‌ కార్పోరేటర్లకే మళ్లీ టికెట్‌ దక్కే అవకాశముందనే వార్తల నేపథ్యంలో... 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల తరహాలో అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. డివిజన్ల వారీగా ఆశావహులు, టికెట్‌ దక్కకుంటే పార్టీని వీడే అవకాశమున్న వారి జాబితాను కూడా ఇప్పటికే సిద్దం చేశారు. వీరు పార్టీని వీడకుండా చూడాల్సిన బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేతో పాటు డివిజన్‌ ఇన్‌చార్జిలకు అప్పగిస్తారు. అవసరమైతే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగే అవకాశం ఉంది. చదవండి: కాంగ్రెస్‌లో లొల్లి, అలిగిన అంజన్‌కుమార్‌‌?!

డివిజన్ల వారీగా ఇన్‌చార్జిలకు బాధ్యతలు 
అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం తదితరాలపై ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అంతర్గతంగా మదింపు పూర్తి చేసింది. పార్టీ, ప్రభుత్వం కోణంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం ఇక్కడే కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఈ నెల 9న జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు భేటీలో ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావుకు ఎన్నికల బాధ్యతను అప్పగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఒకరిద్దరు కార్పొరేషన్‌ చైర్మన్లకు కూడా జీహెచ్‌ఎంసీ డివిజన్‌ వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. బీజేపీలో ముసలం.. ప్లాన్‌ మార్చిన కేసీఆర్‌

బుధవారం ఎవరెక్కడ ఇన్‌చార్జిగా ఉంటారో వెల్లడిస్తారు. ఇన్‌చార్జిలుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయి నుంచి జడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పం చ్‌లు, సహకార సంఘాల చైర్మన్లతో పాటు చురుకైన కార్యకర్తలతో కలిసి తమ కు కేటాయించిన డివిజన్‌లో ప్రచారం చేస్తారు. ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో చురుకైన నాయకులు, కార్య కర్తలను గుర్తించి ప్రచారానికి రావాలని ఆదేశించారు. వీరి వసతి సదుపాయాల కోసం కూడా ఆయా డివిజన్‌ పరిధిలో ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement