విజ్ఞతతో ఆలోచించండి.. మోసపోవద్దు | GHMC Elections 2020: KCR Slams Opposition LB Stadium Public Meeting | Sakshi
Sakshi News home page

విజ్ఞతతో ఆలోచించండి.. మోసపోవద్దు

Published Sun, Nov 29 2020 4:06 AM | Last Updated on Sun, Nov 29 2020 3:00 PM

GHMC Elections 2020: KCR Slams Opposition LB Stadium Public Meeting - Sakshi

సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: విచ్చిన్నకర శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్నాయని, వాటి వలలో పడొద్దని, ఆగం కావొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హైదరాబాద్‌ ప్రజలను కోరారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ఆవేశానికి లోను కావొద్దని, విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. హైదరాబాద్‌ ప్రగతి కోసం టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘హైదరాబాద్‌ల ఇప్పుడు చానా తమాషా జరుగుతా ఉంది. వరద వచ్చింది ఆదుకోండి, పది రూపాయలు ఇవ్వండి అంటే ఇయ్యలె. కాని ఇప్పుడు వరదలా వస్తున్నరు హైదరాబాద్‌కు. ఇది మున్సిపల్‌ ఎలక్షనా? నేషనల్‌ ఎలక్షనా? ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా? అబ్బాబ్బాబ్బా... ఎంత మందయ్యా. జోగడు, బాగడు, జోకెటోడు. 

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక... భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వస్తరా? ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఏం జరుగుతా ఉంది? ఏందీ కథ?’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విపక్షాలపై ధ్వజమెత్తారు. అన్నివర్గాలు కలిసి ఉండే పూలబొకేలాంటి హైదరాబాద్‌ కావాలి. ఇందులోకి ఉడుములు చొచ్చినట్టు చొచ్చి... పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు కొందరు. వారి పంథా మనకు మంచిది కాదు. పక్కరాష్ట్రమోడు వచ్చి నాలుగు తియ్యటి మాటలు చెప్పిపోతడు. వాడిది నెత్తా? కత్తా? వాడికేం బాధ్యతుంటది. మందిమాటలు నమ్మి మార్మానం బోతే మళ్లొచ్చేటప్పటికి ఇల్లు గాలిపోయిందన్న తీరు అవుతుంది. వారి మాటలకు మోసపోవద్దు. హైదరాబాద్‌లో ఉండే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆలోచించాలి’అని కేసీఆర్‌ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

శనివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్‌తో ముచ్చటిస్తున్న కేసీఆర్‌.

టీఆర్‌ఎస్‌ శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘నేను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన విషయం మీకు తెలుసు. అందుకే నాకు తపన ఉంటది. హైదరాబాద్‌తో పాటు ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంచు అన్ని విధాలుగా బాగుపడాలనే కల నాకు ఉంటది. ఎంతో తపన, ఎంతో ఆలోచన, నిధుల కూర్పు, ఆ సంయమనం, ఆ అమలు ఉంటే తప్ప సాధ్యమయ్యేవి కావు. మీరు ఆశీర్వదించి పంపిస్తే, గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా మా ప్రయత్నాలు చేస్తాం’అని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

మేము భారతీయులం కాదా?
బాధ ఏమిటంటే ప్రధానమంత్రిని నేను అడిగిన .. అయ్యా మేము మునిగిపోయినం. ఇబ్బందుల్లో ఉన్నం. రైతుల పంటలు కొన్ని పోయినయి. నగరం దెబ్బతిన్నది. ఏమన్నా గింత సహాయం చేయండయ్యా. ఏడెనిమిది వేల కోట్లు నష్టపోయినం. ఒక రూ.1,350 కోట్లు ఇవ్వమని అడిగినం.. 13 పైసలు కూడా ఇయ్యలె. మేము కనబడ్తలేమా? మేము భారతీయులం కాదా? భారతదేశంలో లేమా? అదే బెంగళూరు, అహ్మదాబాద్‌కు ఇవ్వలేదా? ఉరికి ఉరికి ఇచ్చిన్రు కదా. మేమేం తప్పు చేసినం అని అడుగుతున్నాం. ఈ వివక్ష జరుగుతా ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరికి ఎవరు కర్రు కాల్చి వాతపెట్టాల్నో, ఎవరికి బుద్ధి చెప్పాల్నో నగర ప్రజలు నిర్ణయం చేయాలని నేను కోరుతున్నా. 

ఢిల్లీకి వస్తానని గజగజ వణుకుతున్నరు
‘కేసీఆర్‌ మీ బిడ్డ. తెలంగాణ గడ్డ బిడ్డ. రక్తం, పౌరుషం ఉన్నటువంటి బిడ్డ. ఈ దేశంలో జరుగుతున్న అనేక దుర్మార్గాలు జూసి తడి, మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోర వాస్తవాలు నేను బయటపెట్టిన. ఈ రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) ఘోరంగా విఫలమైనాయి. అందుకే నేను ఓ నినాదం ఇచ్చాను. కానీ ఫ్రంట్‌ లేదు గింట్‌ లేదు అన్నరు. నేనన్ననా ఫ్రంట్‌ ఉంటదని? ఎందుకు ఢిల్లీలో గజగజ వణుకుతున్నరు. తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు.. ఏ వీడొక్కడు ఏం చేస్తడు. బొండిగ పిసికితే అయిపోతది అన్నరు. ఎవరి బొండిగ పిసకాలో పిసికి బాజాప్తా తెలంగాణ తెచ్చిన. నేను ఢిల్లీకి బయలుదేరకుండా ఇక్కడే ఆపేయాలని వరదలాగా, బురదలాగా వస్తున్నరు.

40 కోట్ల మంది సభ్యులున్న, రూ.30 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్‌ఐసీని, రైల్వే, బీహెచ్‌ఈఎల్‌ను ఎందుకు అమ్ముతున్నారు. నన్ను కిందిమీద చేయాలని, మాయా మశ్చీంద్ర చేస్తూ ఇంతమంది వస్తున్నరు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మనకు నీతి చెప్తాడట, ఆయనకే ఠికానా సరిగా లేదు. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయంలో 13వ స్థానంలో ఉన్న మనం ఐదో స్థానానికి వచ్చాం. ఉత్తరప్రదేశ్‌ 28వ స్థానంలో ఉంది. ఆ స్థానంలో ఉన్నాయన ఐదో ర్యాంకులో ఉన్న మనకు చెప్తాడట. బిల్డర్‌ మిత్రలు ఆలోచించాలి. బీపాస్‌ కావాలా? కర్ఫ్యూ పాస్‌ కావాలా? ఆలోచించాలి. వర్తక వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలు నగరాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి. 

ప్రజలను విడదీసే కుట్రలు...
ఉజ్వలంగా ప్రగతిబాటలో ముందుకు పరుగుపెడుతున్న హైదరాబాద్‌ పురోగతిని అస్థిరపరిచే శక్తులు కుయుక్తులతో ముందుకొచ్చాయి. ప్రజల్లో చిచ్చుపెట్టి విడదీసే కుట్రలు చేస్తున్నాయి. వారి నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన తరుణమొచ్చింది. వెంటనే మేల్కొనండి, విజ్ఞతతో ఆలోచించండి. మన కోసమే కాదు, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ శక్తులను తరిమికొట్టాలి. ప్రగతిశీల ఆలోచనతో ఉన్న పార్టీకి మద్దతు తెలపండి. విద్యాధికులు, నిపుణులు, ఉద్యోగులు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. కొన్ని విచ్చిన్నకరశక్తులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయి, వాటి వలలో చిక్కొద్దు, ఏదో పిచ్చి ఆవేశానికి పోయి వాటి మాటలు నమ్మకండి. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఈ రాష్ట్ర పెద్దగా, ముఖ్యమంత్రిగా అభ్యర్థిస్తున్నాను, తెలివితో ఆలోచించండి, మీరు ఆగం కాకండి, హైదరాబాద్‌ను ఆగం చేయకండి.

ఇప్పుడు పొరపాటు చేస్తే హైదరాబాద్‌ పురోగతి పూర్తిగా నిలిచిపోతుంది, భూముల ధరలు పడిపోతాయి, వ్యాపారాలు బంద్‌ అవుతాయి. ఇది హైదరాబాద్‌కు ఏమాత్రం క్షేమం కాదు. అందుకే ఇంతకాలం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌కు అండగా నిలవండి, నగరంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి. మంచిపేరు ఉన్న వారు, సేవాగుణం ఉన్నవారినే అభ్యర్థులుగా నిలబెట్టాం. వారికి మద్దతు ఇవ్వండి. గతం కంటే ఓ ఐదారు సీట్లు ఎక్కువే ఇచ్చేలా ఓటు వేసేందుకు ముందుకు రండి. ముఖ్యంగా యువకులు పిచ్చి ఆవేశానికి వెళ్లొద్దు. భవిష్యత్తు మీది, భావి హైదరాబాద్‌ గొప్పగా ఉండాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి, నిధులు రప్పించి అభివృద్ధి చేస్తాం. 

శనివారం ఎల్బీస్టేడియంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల బహిరంగ సభకు పోటెత్తిన మహిళలు

తలుచుకుంటే నశ్యం కింద కొడతాం బిడ్డ
కొందరు నన్ను కూడా రారా, పోరా అని మాట్లాడుతున్నారు. అన్నీ వింటున్నా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యతలో ఉన్న వ్యక్తిగా వాటికి స్పందించటం లేదు. తిరిగి తిట్టేందుకు చేత కాక కాదు, మాకు కార్యకర్తలు లేక కాదు. నేను తలుచుకుంటే అంతకంటే ఎక్కువే తిట్టగలను. తలుచుకుంటే దుమ్ముదుమ్ము నశ్యం కింద కొడతాం బిడ్డ. మాకు 60 లక్షల కార్యకర్తల బలం ఉన్నా ఆ చిల్లర మాటలకు టెంప్ట్‌ కావద్దని ఊరుకుంటున్నం. మనకు ఎవరూ బాస్‌లు లేరు. ఢిల్లీకి గులాములం కాదు. మనకు ప్రజలే బాస్‌లు. గతం కంటే ఎక్కువ సీట్లతోనే బ్రహ్మాండమైన విజయాన్ని సాధించబోతున్నాం. 

ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలి    
ఎలక్షన్లు చాలా జరుగుతూ ఉంటాయి. మీ విచక్షణ ఉపయోగించి.. పార్టీలకు ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలి. ఒక పార్టీ, నాయకుడు, ప్రభుత్వం ఎలా ఆలోచిస్తా ఉంది, ఎలా పని చేస్తా ఉంది, వారి దృక్పథం, వైఖరి ఏ విధంగా ఉంది? ప్రజల గురించి, అభివృద్ధి గురించి, భవిష్యత్తు కోసం వారు ఏ విధంగా ఆలోచిస్తున్నరు అనే విషయం మీద చర్చ జరగాలి. ఆలోచించుకుని ప్రజలు నిర్ణయానికి రావాలి. అప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మంచి పార్టీలు ఎన్నుకోబడ్తయి. పనిచేసే వాళ్లు పుట్టుకొస్తారు. పనితనంలో, ప్రజలకు సేవ చేయడంలో పోటీతత్వం పెరుగుతంది. తద్వారా ప్రజలకు, సమాజానికి చాలా మేలు జరుగుతుంది. అలవోకగా, గాలివాటంగా ఓటు వేయకూడదు. 

నగర ప్రజలకు 24 గంటలు నల్లా నీళ్లు..
రాష్ట్రం ఏర్పడ్డాక ఏడెనిమిది మాసాల్లో మొత్తం కరెంట్‌ బాధలు తీర్చినం. మిషన్‌ భగీరథను ఐదేళ్లలో చేసి ఇవ్వకపోతే ఓట్లు అడగం అని చెప్పిన మగతనం ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ. నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచి నీటి సదుపాయం కల్పించాలని కేసీఆర్‌ కల. రాబోమే కొద్ది నెలలు, సంవత్సరాల్లో నగరంలో 24 గంటలూ మంచినీరు సరఫరా చేస్తం. పేదలు, మధ్యతరగతి ప్రజలకు నల్లా బిల్లు బాధలు తొలగించాలని 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించాం. ఇది ఎన్నికల తాయిళం కాదు. నగర ప్రజలకు, పేదలకు కేసీఆర్‌గా, మీ బిడ్డగా నేను అందించిన శాశ్వత కానుక. 97 నుంచి 98 శాతం ప్రజలకు ఈ స్కీం వర్తిస్తుంది.. ప్రతి అపార్ట్‌మెంట్లలోని కుటుంబాలకు సైతం 20 వేల లీటర్లు ఉచితంగా ఇస్తాం. 

సంక్షేమంలో నంబర్‌ 1
కరోనా రక్కసితో రాష్ట్రానికి రూ.52 వేల కోట్ల నష్టం వచ్చింది. అయినా సంక్షేమం ఆపలే. సంక్షేమ కార్యక్రమాల్లో మనకెవరూ సాటి లేరు. ఏటా రూ.40 వేల కోట్లకు పైచిలుకు డబ్బుతో కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నం. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసినం. సాగులో ఇండియాలోనే నంబర్‌ వన్‌కు పోతున్నం. నంబర్‌ టూ స్థానానికి వచ్చినం. లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ధాన్యరాశులతో తెలంగాణ కళకళలాడుతోంది. అదంతా కూడా మీ కళ్ల ముందే ఉంది. అవన్నీ జరిగినయి. నలువైపులా విస్తరించిన నగరంలోని బస్తీలు, వాడలు, కాలనీల్లో సరైన సదుపాయాలు కోసం టీఆర్‌ఎస్‌ దాదాపు రూ.60, 70 వేల కోట్ల ఖర్చు పెట్టి శ్రమపడ్డది. హైదరాబాద్‌లో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. 

వరదల నుంచి శాశ్వత విముక్తి
వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలె. దీనికి సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ప్రతి బడ్జెట్‌లో కేటాయిస్తం. నాలాలన్నీ కబ్జా అయినయి. మురుగు కాల్వలన్నీ మూసుకుపోయాయి. వాటన్నింటిని తొలగించాలి. తాత్కాలిక, మధ్యతరహా, దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలె. జీహెచ్‌ఎంసీలో మీరు భారీగా గెలిపించండి. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అండగా ఉంటుంది. ఈ వరదల బారి నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కల్పిస్తుంది. నగరం నుంచి కాలుష్యకారక పరిశ్రమలను తరలించి కాలుష్యం లేకుండా చేస్తాం. మెట్రో రైలును మరిన్ని ప్రాంతాలకు, ఏయిర్‌పోర్టుకు విస్తరిస్తం. మురికిగా మారిపోయిన మూసీ నదిని గోదావరితో అనుసం«ధానం చేస్తాం. దానిని తప్పకుండా ప్రక్షాళన చేసి యుద్ధ ప్రాతిపదికన... ఒక అందమైన మూసీని హైదరాబాద్‌కు అందించే బాధ్యత నాది. చల్లటి, చక్కటి హైదరాబాద్‌ కావాలి. అన్ని రకాల సామరస్యంతో, పిల్లాపాపలతో ప్రజలందరూ ఆనందంగా, చిరునవ్వులతో బతికే హైదరాబాద్‌ కావాలి.

కిరికిరి పెడ్తరు నా కొడుకులు
వరదల్లో సర్వం కోల్పోయిన నగర ప్రజలకు రూ.10 వేలు సహాయం చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నం. చరిత్రలో ఎవ్వడూ ఇవ్వలేదు. ఢిల్లీ, ముంబైలో ఇవ్వలే. బీజేపీ, కాంగ్రెస్‌ పరిపాలించిన కాడ ఇవ్వలె. కానీ ఈడ మాత్రం కిరికిరి పెడ్తరు నా కొడుకులు.... బాధపడి అంటున్న ఈ మాట. ఎక్కడా ఇచ్చింది లేదు. కాని ఇచ్చేకాడ కిరికిరి పెడ్తరా? ఇదేనా మీ విజ్ఞత? మీ తెలివి? ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 6.5 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ.650 కోట్లను అందించింది ఈ కేసీఆర్‌ ప్రభుత్వం కాదా? నగర ప్రజానీకం ఆలోచన చేయాలి. ఒకడు పత్రం రాస్తడు... ఒక ఉత్తరం రాస్తడు.. నేను రాయలేదు అంటడు. ఎలక్షన్లలో ఈసీని ఇబ్బంది పెట్టి బంద్‌ చేయించితిరి. ఎంతమంది పేదలు, అర్హులు మిగిలి ఉన్నారో... వారిలో ప్రతి ఒక్క కుటుంబానికి డిసెంబర్‌ 7 నుంచే రూ.10 వేలు పంపిణీ చేసే బాధ్యత నాదే. ఆరున్నర లక్షల కుటుంబాలకు ఇచ్చినం. ఇంకో మూడు నాలుగు లక్షల కుటుంబాలు ఉండవచ్చు. ఇంకో రూ.నాలుగు వందల కోట్లు ఇవ్వడానికి మా ప్రభుత్వం వెనక్కి పోదు. 

శాంతిభద్రతల విషయంలో రాజీలేదు
గత ఆరేళ్లుగా శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. కొందరు ముష్కరులు, రౌడీ మూకలను ఏ విధంగా అణిచివేశామో మీరు చూశారు. పీడీ యాక్టు పెట్టినం. నేరగాళ్లందరినీ వణికించినం. ఒక శ్రేష్టమైన, అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ తయారు కావాలి. కొందరి కోసం పనిచేసి అందరి హైదరాబాద్‌ను ఆగం చేసే ఎజెండా మాది కాదు. 

టార్చిలైట్‌ వేసి చూసినా వివక్ష కనపడదు
అందరి అంచనాలు తలకిందులు చేసి ఏ రకమైన కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌ తీసుకుందో, ఏ రకంగా పురోగమించిందో, ఏ రకమైనటువంటి సోదర, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించిందో చూశారు. హైదరాబాద్‌లో కానీ, రాష్ట్రంలో కానీ కుల, మత జాతి, ప్రాంత వివక్ష చూపలేదు. ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎవరూ ఊహించని పరిణితిని, పరిపక్వతను, ఎనలేని ఓపికను తెచ్చుకుని ఈ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డా మా బిడ్డే .. భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చినా హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా మా బిడ్డే. వారి సంరక్షణ మా బాధ్యత అని నేను ధైర్యంగా చెప్పిన. 

గత ఏడేళ్లు అదే విధంగా వ్యవహారం జరిగింది. ఎక్కడా మత, కుల, ప్రాంతీయ వివక్ష టార్చిలైట్‌ వేసి చూసినా కనబడదు. టీఆర్‌ఎస్‌ ఏనాడు కూడా పాక్షిక, పక్షపాత నిర్ణయాలు చేయలె. ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా జాతి, కులం, మతం చూడలేదు. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఆచరణ చేయని కార్యక్రమం కంటి వెలుగు. కళ్యాణలక్ష్మి అందుకోని ఏ కులం, ఏ మతం వాళ్లు అయినా ఉన్నరా?. కేసీఆర్‌ కిట్టు సూపర్‌ హిట్టు. రైతుబంధు ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నగరంలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినం. కుల వృత్తుల వారందరినీ ఆదుకున్నం. దోబిఘాట్లకు వాడుకునే మోటార్లకు, లాండ్రీలు కరెంట్‌ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఆ భారం భరిస్తుంది. ఎంబీసీల కార్పొరేషన్‌ పెట్టినం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి వెయ్యి గురుకులాలను ప్రారంభించినం. ఇవన్నీ కుల, మత, వర్గబేధం లేకుండా అందరి కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాలు. అందరికీ అందబాటులో ఉన్న పథకాలు. ఇదంతా స్టోరీ కాదు. ఎక్కడ్నో అమెరికాలో జరిగిన కథ కాదు. మన రాష్ట్రంలో మన కళ్ల ముందు ఈ ఆవిష్కరణలన్నీ జరిగాయి.

చిత్రంలో అభివాదం చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, మహమూద్‌ అలీ, మధుసూదనాచారి, కేశవరావు,తలసాని, కేటీఆర్, ఈటల, కొప్పుల ఈశ్వర్, పద్మారావుగౌడ్, పువ్వాడ, సత్యవతి, సబితా ఇంద్రారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement