‘సమైక్య ఎంపీల’ను బరిలో దింపే యోచనలో సీమాంధ్ర నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటివరకు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ చైతన్యరాజు పార్టీ రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగాలని నిర్ణయించగా... తాజాగా సీమాంధ్ర లోక్‌సభ ఎంపీల్లో ఒకరిని రాజ్యసభ బరిలో దింపే దిశగా సమాలోచనలు సాగుతున్నాయి. సమైక్యవాదం పేరుతో ఇటీవల రాజీనామా చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన ఎంపీల్లో ఒకరిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని శనివారం కలిసి... హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలంటే సమైక్యవాదాన్ని విన్పిస్తున్న ఎంపీని రెబల్ అభ్యర్థిగా నిలబెడితేనే మంచిదని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం సీమాంధ్ర ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, హర్షకుమార్‌లతో అసెంబ్లీ లాబీల్లోని తన చాంబర్లో సమావేశమయ్యారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటేస్తారనే అంశంపై వారు లోతుగా చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంపై సోమవారం స్పష్టమైన నిర్ణయానికి రావాలని సీఎం భావిస్తున్నారు.
సీమాంధ్ర లోక్‌సభ సభ్యుల్లో ఒకరిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకోవడం మంచి పరిణామమని హర్షకుమార్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా రాజ్యసభ బరిలో దిగాలని భావిస్తున్న గంటా, జేసీ. చైతన్య రాజు తమకు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారనే దానిపై లెక్కలేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఆదివారం వారు సీమాంధ్ర మద్దతుదారులతో సమావేశం కాబోతున్నారు.
కాంగ్రెస్‌లో మలుపులు!
Published Sun, Jan 26 2014 2:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement