{పేమ వివాహంపై పెద్దల కన్నెర్ర
వరుని ఇంటిపై దాడి చేయించిన మామ... వధువు కిడ్నాప్
రాజకీయ ఒత్తిడితోపట్టించుకోని పోలీసులు
న్యాయం చేయమంటున్న ప్రేమికుడు
విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ నేత కుమార్తె రామినీడి పూజా సరస్వతి, చింత రాజేష్ ఒక కళాశాలలో లెక్చరర్లుగా పనిచేసేటప్పుడు పరిచయమయ్యారు. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఎనిమిది నెలల క్రితం రాజేష్ విశాఖపట్నంలోని గాజువాకకు వచ్చేశాడు. అక్కడే ఒక ప్రయివేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇంతలో సరస్వతికి ఆమె తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేస్తుండటంతో రాజేష్‌ను సంప్రదించి వెంటనే పెళ్లి చేసుకోమని కోరింది. పెళ్లికి రాజేష్ తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ నెల 12న సింహాచలం దేవస్థానంలో ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. వివాహాన్ని చట్టపరంగా రిజిస్టర్ కూడా చేయించుకున్నారు. ఈ విషయాన్ని భార్య సరస్వతి తల్లిదండ్రులకు తెలియజేయగా వదిలేసినట్టు నటించారు.
మూడు వాహనాల్లో 30 మందితో దాడి
ఈ నెల 15న ఉదయం 6.15 గంటలకు సరస్వతి తండ్రి అనుచరులు 30 మంది మూడు వాహనాలతో గాజువాక చట్టివానిపాలెంలో ఉంటున్న రాజేష్ ఇంటిపై దాడి చేశారు. వారిలో 15 మంది ఇంట్లోకి చొరబడి రాజేష్, అతని కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు. భయాందోళనలు చెందిన సరస్వతిని ఇన్నోవా కారులో తీసుకెళ్లిపోయారు. రెండు సెల్‌ఫోన్లు, రెండు తులాల చైనును కూడా అనుచరులు పట్టుకుపోయారని తెలిపాడు.
గాయపడిన రాజేష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయగా రోజంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచేశారు. ఎలాంటి కేసు కట్టకుండా వదిలేశారు. ఇద్దరూ మేజర్లు అయినప్పటికీ వివాహ సర్టిఫికెట్, ఫొటోలు తీసుకొని దర్యాప్తు చేపడతామని చెప్పి పంపేశారు. ఈ విషయాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని బాధితుడు వాపోయాడు. తన భార్య ఆచూకీ తెలిపి సురక్షితంగా అప్పగించాలని విజ్ఞప్తి చేశాడు.
ప్రేమే నేరమౌనా!
Published Thu, Dec 18 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM
Advertisement
Advertisement