ఎంపీ అనంత వైఎస్సార్‌సీపీలో చేరిక | M.P ananth venkatram reddy joins in YSRCP party | Sakshi
Sakshi News home page

ఎంపీ అనంత వైఎస్సార్‌సీపీలో చేరిక

Published Mon, Mar 10 2014 3:12 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఎంపీ అనంత వైఎస్సార్‌సీపీలో చేరిక - Sakshi

ఎంపీ అనంత వైఎస్సార్‌సీపీలో చేరిక

సాక్షి ప్రతినిధి, అనంతపురం : కాంగ్రెస్ సీనియర్ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లాలో పటిష్ఠంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ అనంత చేరికతో మరింత బలోపేతమైంది. ఇక జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని రాజకీయ పరిశీలకులు స్పష్టీకరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎంపీ అనంతతోపాటు అనంతపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, ముదిగుబ్బ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగరాజు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంలో ఎంపీ అనంత వెంట ఆ పార్టీ నేతలు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎస్‌ఎండీ ఇస్మాయిల్ ఉన్నారు.
 
 అనంతపురం లోక్‌సభ నుంచి 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనంత వెంకటరామిరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయ అరంగేట్రంలోనే 78,859 ఓట్ల మెజార్టీతో ఎంపీగా అనంత విజయం సాధించారు. లోక్‌సభకు 1998లో నిర్వహించిన మధ్యంతర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 82,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1999 జమిలి ఎన్నికల్లో వాజ్‌పేయి సానుభూతి పవనాలు బలంగా వీయడంతో టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు చేతిలో 21,102 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ నుంచి పోటీ చేసిన అనంత 73,421 ఓట్ల ఆధిక్యతంతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి 77,291 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 
 ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తండ్రి అనంత వెంకటరెడ్డి అనంతపురం శాసనసభ్యునిగా 1969, 1972 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలుపొందారు. 1989, 1991 ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి అనంత వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఆదివారం ఎంపీ అనంత తెంచుకున్నారు. 1982 నుంచి 1986 వరకు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా, 1986 నుంచి 1996 వరకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2000 నుంచి 2005 వరకూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన అనంత వెంకటరామిరెడ్డికి అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాల పరిధిలో  అనుచరగణం ఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని నిలదీసిన ఎంపీ అనంత సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు. సమైక్యాంధ్ర నినాదంతో హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు అక్టోబరు 9న ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే సమైక్యాంధ్ర కోసం చిత్తశద్ధితో పోరాడుతున్నారని అప్పట్లో ఆయన ప్రకటించిన విషయం విదితమే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సార్‌సీపీని స్థాపించిన సమయంలోనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 75 శాతం ఖాళీ అయిపోయింది. ఎంపీ అనంత, వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి చిన్ననాటి స్నేహితులు. తన స్నేహితుడు ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావడంలో తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు.
 
 ఆది నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో ఎంపీ అనంత కు అనుబంధం ఉంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ అ నంత లోక్‌సభలో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. ఆదివారం ఆయన చేరిక తో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టీకరిస్తున్నారు. తక్కిన నేతలు అందరూ ఎంపీ అనంతనే అనుసరించి వైఎస్సార్‌సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీ చేరికతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
 వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం: ఎంపీ అనంత
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం రాజీలేని పోరాటం చేశారు. లోక్‌సభలో సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకోవడంగానీ.. జైల్లో ఉన్నప్పుడు నిర్బంధాన్ని లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేపట్టడం.. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమరణ దీక్ష చేపట్టడం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పోరాటంలో చిత్తశుద్ధి ఉందనడానికి నిదర్శనాలు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని చంద్రబాబు పదే పదే లేఖలు రాశారు.
 
 అలాంటి వేర్పాటువాది, నయవంచకుడు ఈ రోజు తెలుగు ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. సేద్యానికి ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు.. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానంటూ మరోసారి మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన ఆశయాలు సాధించే సత్తా వైఎస్ జగన్‌కే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నా. నిత్యం కరువుకాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లా రాష్ట్ర విభజనతో మరింత కష్టాలపాలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. నేను ఏ పదవి ఆశించి వైఎస్సార్‌సీపీలో చేరలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేయడం నా ముందున్న ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement