ముఖ్యమంత్రి నీచ రాజకీయాలు మానుకోవాలి
మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే
రెంటచింతల: కాపు గర్జనపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రెంటచింతలలోని వైఎస్సార్‌సీపీ నాయకులు గాలి ప్రతాప్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి కోసం చంద్రబాబు హామీల మీద హామీలు ఇచ్చారని, ఇప్పుడు హామీల అమలు కోసం ఉద్యమిస్తుంటే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై బురద చల్లేందుకు త నతోపాటు మంత్రుల చేత కూడా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
ఆత్మ విమర్శ చేసుకుని వాస్తవాలను ప్రకటించేందుకు చంద్రబాబు ముందుకు రావాలన్నారు.అధికారం శాశ్వితం కాదనే విషయాన్ని టిడిపి నేతలు గుర్తుంచుకొని మాట్లాడాలన్నారు. సీఎం చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజులలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి అల్లం ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యులు మోర్తల ఉమామహేశ్వరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు పశర్లపాడు బ్రహ్మరెడ్డి, పోట్ల ముత్తయ్య, సర్పంచ్ వెన్నాలింగారెడ్డి, బుడసైదా తదితరులున్నారు.
ఇప్పటికైనా నిర్ణయాన్ని ప్రకటించండి..
మాచర్ల: కాపుల రిజర్వేషన్‌ల విషయంలో ప్రభుత్తం తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. కాపులను రెచ్చగొట్టి పలు సాకులతో అవాంతరాలు సృష్టించి తీరా గొడవలు జరిగితే దానికి సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్షాన్ని విమర్శించటం అత్యంత హేయమైన చర్య అన్నారు. తునిలో కాపుల సభలో జరిగిన సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు.
ముందుగానే కాపుల గురించి చర్యలు తీసుకొని వారికి ఇచ్చిన హామీల ప్రకారం నిర్ణయం తీసుకొని ఉంటే సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ జగన్, వైఎస్సార్‌సీపీలపై విమర్శలు చేయటం సమంజసం కాదన్నారు. ఇష్టానుసారంగా విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.