అనంతపురం న్యూటౌన్ : కాపు గర్జనలో జరిగిన విధ్వంసానికి ప్రతిపక్ష నేత జగన్ బాధ్యుడనడం సీఎం చంద్రబాబు నాయుడు చేతకానితనమని కాపు నాయకులు విమర్శించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కేటీబీ (కాపు, తెలగ, బలిజ) కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీబీ రాష్ట్ర నాయకుడు జంగటి అమర్‌నాథ్ మాట్లాడుతూ తునిలో రైలును కాల్చిన సంఘటన దురదృష్టకరమని, అయితే ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పిదమేనన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మునిరత్నం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షనేత జగన్‌పైకి తోసేయడం చంద్రబాబుకు రివాజుగా మారిందన్నారు.
కాపులను, బీసీలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్న ప్రభుత్వ పెద్దలు త్వరలో గుణపాఠం నేర్చుకోకతప్పదన్నారు. బీసీ సంఘం నేతలతో కాపులపై విమర్శలు చేయిస్తుండడం సీఎం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాపులను బీసీలలోకి చేర్చేదాకా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాపు సంఘం నేతలు భగవాన్ సునీల్, చైతన్య, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కాపు రిజర్వేషన్ల కోసం, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఆత్మత్యాగం చేసిన బలిజ యువకుడు సీవీ రమణమూర్తికి ఆత్మశాంతి కలగాలని కొద్ది నిముషాల పాటు మౌనం పాటించారు.
విధ్వంసానికి జగన్ బాధ్యుడంటే ఎలా ?
Published Wed, Feb 3 2016 3:10 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement