
మాగుంటను అనర్హుడిగా ప్రకటించాలి
ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ హామీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల నుంచి ఏపీ శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాక, వారితో శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని తక్షణం అనర్హుడుగా ప్రకటించాలని, ఆ పార్టీ అధ్యక్షుడిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు మంగళవారం సచివాలయంలో ఉభయ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్‌ను కలుసుకుని ఆ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి 496 మంది, టీడీపీకి 472 మంది ఎంపీటీసీలున్నారు. దీన్నిబట్టి వైఎస్సార్‌సీపీ అభ్యర్థే గెలుపొందడం ఖాయమని తేలిపోవడంతో 35 మందికి రూ.2.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి శ్రీనివాసులురెడ్డి ప్రలోభపెట్టారని తెలిపారు. మొదట రూ.50 వేలు చొప్పున అడ్వాన్సుగా చెల్లించి ప్రలోభపెట్టి నెల్లూరు శిబిరానికి తరలించుకు వెళ్లారని చెప్పారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, అక్రమంగా శిబిరాల నిర్వహణకు కారణమైన మాగుంటను అనర్హుడుగా ప్రకటించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
తమకు టీడీపీ అభ్యర్థి కొంత డబ్బు అడ్వాన్సుగా చెల్లించారని స్వయంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు మీడియాకు చెప్పిన దృశ్యాల సీడీని కూడా అందించారు. ఫిర్యాదుపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టాల్సిందిగా ఆదేశిస్తానని భన్వర్‌లాల్ వారికి హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు భ్రష్టు పట్టాయని, జాతీయస్థాయిలో అందరి దృష్టీ ఇక్కడే ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సీఈఓను కలిసిన అనంతరం జ్యోతుల నెహ్రూ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ప్రకాశంలో ప్రలోభాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.